ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 27 : ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో గురువారం జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. ఏదులాపురం మున్సిపాలిటీలోని జలగంనగర్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 105వ పోలింగ్ కేంద్రంలో మొత్తం 488 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. వీరిలో 461 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, ఈ పోలింగ్ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులకు తోడుగా ఆయా రాజకీయ పార్టీల నేతలు కూడా వచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహించారు. పోలింగ్ కేంద్రానికి సమీపంలో ప్రధాన రహదారి వెంబడి భారీ టెంట్లు వేశారు. పోటీలో ఉన్న అభ్యర్థుల ఫ్లెక్సీలను ప్రదర్శించారు.
ఎన్నికల సంఘం (ఈసీ) నిబంధనలు ఉల్లంఘించి మరీ టెంట్లకు ఇరువైపులా పలు జెండాలను, అభిమాన నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించి ఓటర్లను ప్రభావితం చేశారు. ఇదే అంశంపై ‘నమస్తే తెలంగాణ’ వెబ్న్యూస్లో కథనం ప్రచురితం కావడంతో అధికారులు తక్షణమే స్పందించారు. కొద్దిసేపటి తరువాత అధికారులు అక్కడికి చేరుకొని ఫ్లెక్సీలను, ఇతర ప్రచార పోస్టర్లను తొలగించారు. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ ముష్కారాజు కలిసి బందోబస్తు చేపట్టారు. ఎంసీసీ అధికారి ఎస్.కుమార్, ఆర్ఐ ప్రసాద్‌లు పోలింగ్ ప్రక్రియ తీరును పర్యవేక్షించారు.