పాల్వంచ, డిసెంబర్ 15: భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో ఒక్కసారిగా బాంబు పేలిన శబ్దంతో భూప్రకంపనలు వచ్చాయి. దీంతో పట్టణవాసులు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏమైందో తెలియక కొద్దిసేపటి వరకు అయోమయంలో ఉన్నారు. ఈ ఘటన రాత్రి వరకు పట్టణంలో చర్చనీయాంశమైంది.
భూప్రకంపనపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తాయి. నాలుగేళ్ల క్రితం ఇదే విధంగా పాల్వంచ, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో భూమి కంపించింది. కిన్నెరసాని రిజర్వాయర్, గోదావరి పరివాహక ప్రాంతాల్లోని భూమి పొరలు కదలడంతోనే ప్రకంపనలు వచ్చాయని నాడు భౌగోళిక శాస్త్రవేత్తలు వెల్లడించారు. నాటి కంటే ఈసారి తక్కువ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు.