ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆటంకాలతో మొదలైంది. సర్టిఫికెట్ల పరిశీలనకు వచ్చిన విద్యార్థుల సహనాన్ని పరీక్షించింది. దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అవస్ధలు పడ్డారు. ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎప్సెట్-2025 కౌన్సెలింగ్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఉదయం 9 గంటల స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు నిర్ణీత సమయానికంటే ముందుగానే కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జాకీరుల్లా ఈ ప్రక్రియను ప్రారంభించారు. సర్టిఫికెట్ల పరిశీలన చేసేందుకు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో బృందాలను నియమించారు. ధ్రువపత్రాల పరిశీలన చేసిన అనంతరం విద్యార్థుల వివరాలను ఎప్సెట్ పోర్టల్లో ఆన్లైన్ చేశారు. తరువాత వారికి రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్ (ఆర్వోసీ) ఫారాన్ని అందజేస్తారు. -ఖమ్మం అర్బన్, జూలై 1
కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం చేసే ఆన్లైన్ ప్రక్రియకు ఆటంకం కలిగింది. కళాశాల ప్రిన్సిపాల్ సంబంధిత నెట్ (అంతర్జాల) సిబ్బందికి సమాచారం అందించారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. అయినప్పటికీ మధ్యాహ్నం వరకు అంతర్జాలం పునరుద్ధరణ కాలేదు. దీంతో ఉన్నతాధికారుల సూచనతో ప్రైవేట్ నెట్ సహాయంతో ప్రక్రియను నిర్వహించినా.. నెట్ స్పీడ్ సరిపోక ప్రక్రియ ఆలస్యమైంది. సాయంత్రం సమయంలో నెట్ సమస్య తొలగిపోవడంతో అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు. ఉదయం 10 గంటల సమయంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థులకు గంటలు గడుస్తున్నా ఆర్వోసీ అందజేయకపోవడంతో అధికారులతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు.. కౌన్సెలింగ్ సెంటర్కు చేరుకుని ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగింది.
మంగళవారం ఉదయం నుంచి ఆగుతూ ఆగుతూ కురుస్తున్న వర్షానికి కళాశాలలోకి వరద చేరింది. కౌన్సెలింగ్కు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమీప గదుల్లోకి పరుగులు తీశారు. ఉదయం 9 గంటలకంటే ముందుగానే కళాశాల పరిసరాలు విద్యార్థులతో కిక్కిరిశాయి. ఆ తరువాత వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గొడుగులు పట్టుకొని ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. ఖమ్మంతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల ప్రతినిధులు కౌన్సెలింగ్ సెంటర్లో ప్రచారం చేశారు. అక్కడితో ఆగకుండా వచ్చిపోయే విద్యార్థుల వివరాలు చెప్పాలని కోరడంతో కొందరు విద్యార్థినులు ఇబ్బందులు పడ్డారు. కాగా, తొలిరోజు కౌన్సెలింగ్కు 570 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా.. 510 మంది హాజరయ్యారు.