రఘునాథపాలెం, ఆగస్టు 8 : ఖమ్మం నగరం కేంద్రంగా నకిలీ వైర్ల దందా నడుస్తోంది. కాపీరైట్ యాక్ట్‌ను ఉల్లంఘించి బ్రాండెడ్ కంపెనీల పేరుతో డూప్లికేట్ ఎలక్ట్రిక్ వైర్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఖమ్మం నగరం విస్తరిస్తూ చుట్టూ అధికసంఖ్యలో బిల్డింగ్స్ నిర్మాణం జరుగుతుండటంతో ఇండ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొంతమంది వ్యాపారులు అక్రమ దందాకు తెరలేపారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్, ఖానాపురం హవేలీ పోలీసులు శనివారం దాడిచేసి ఖమ్మం నగరం 6వ డివిజన్ పరిధి ప్రశాంతినగర్‌లో నకిలీ వైర్ల దందాను గుట్టురట్టు చేశారు. వ్యాపారి, కొంతమంది వర్కర్లు పరారీ కాగా.. ఇద్దరు రాజస్థాన్ వర్కర్లు, స్థానిక గిరిజన యువకుడు పట్టుబడ్డారు.
శానిటరీ సామాన్ల పేరుతో గోదామును అద్దెకు తీసుకున్న సదరు వ్యాపారి నకిలీ వైర్లను బ్రాండెడ్ అట్టల్లో బ్రాండెడ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ప్యాకింగ్ చేయిస్తున్నాడు. వాటిని ఎలక్ట్రీషియన్ల సహాయంతో ఇంటి యజమానులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ, ఖానాపురం హవేలీ సీఐ భానుప్రకాశ్ తమ సిబ్బందితో సంయుక్తంగా ఆ స్థావరంపై దాడి చేశారు. పట్టుబడిన వర్కర్లు ఇద్దరు రాజస్థాన్ యువకులు, రఘునాథపాలెం మండలం కొర్లబోడుతండాకు చెందిన అనిల్ అనే గిరిజన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వైర్లను స్వాధీనం చేసుకున్నారు.