కారేపల్లి : చేపల చెరువు విషయమై అన్యాయం జరిగిందంటూ కారేపల్లి మండలం మేకలతండా గ్రామస్తులు సోమవారం గ్రామంలోని నీళ్ల ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశారు. దుబ్బతండా గ్రామపంచాయతీలోని తుమ్మలకుంట చెరువు పట్టా భూమి, దేవాదాయ శాఖ భూములలో ఉందని దాని పేరుతో అక్రమంగా 2011లో మత్స్యశాఖ అధికారులు సోసైటీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారని పట్టా భూమి కల కుటుంబీకులు వాదిస్తున్నారు.
చెరువు పట్టా భూమి విషయమై గ్రామ పంచాయతీలోని ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఈక్రమంలో ఏప్రిల్ 18 న తేదిన తుమ్మలకుంట చెరువును కొందరు గ్రామస్తులు లూటీ చేశారు. దీనిపై ఇరువర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టాదారులమైన తమపైనే కేసులు పెట్టారంటూ కొందరు గ్రామస్తులు ఆరోపిస్తూ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. గ్రామపెద్దలు కలుగజేసుకోని పోలీసులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో వారు అందోళన విరమించారు.