కారేపల్లి,మార్చి 24 : దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సింది నేటితరం విద్యార్థులని, వారిని మాదకద్రవ్యాల మహమ్మారి నుండి కాపాడుకోవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్ స్పెషల్ డీఎస్పీ కే నర్సింగ్ రావు అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం డ్రగ్స్ నివారణఫై అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులు తమ శక్తిని క్రీడలు, విద్య ఇతర నిర్మాణాత్మక కార్యక్రమాల వైపు మళ్లించుకోవాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా డ్రగ్స్ సరఫరా లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉంటే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
డ్రగ్స్ వ్యాపారంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, యువత భవిష్యత్తును కాపాడటమే పోలీస్ శాఖ,ఈగల్ టీమ్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ నూనావత్ సాగర్, ఎక్సైజ్ సీఐ ప్రశాంతి, తాసీల్దార్ రమేష్, ఎంపీడీఓ శ్రీనివారావు, ఎంఈఓ జయరాజు, ఎస్ఐ గోపి, కారేపల్లి సర్పంచ్ మేదరి టోనీ తదితరులు పాల్గొన్నారు.