గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులను ఈ ఏడాది కష్టనష్టాలు వెంటాడాయి. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో కుదేలైన అన్నదాతలను కొత్తగా వచ్చిన ప్రభుత్వమూ మరింత కుంగదీసింది. గత కేసీఆర్ ప్రభుత్వం కొనసాగించిన రైతుబంధు పంటల పెట్టుబడి సాయాన్ని అందించలేదు. పైగా తాము పెంచి ఇస్తామంటూ గొప్పలు చెప్పిన రూ.15 వేల రైతుభరోసాకు ఎగనామం పెట్టింది.
ఒక్కో ఎకరానికి రూ.30 వేల మేర పెట్టుబడి పెట్టి ఉన్న రైతులకు వానకాసం సీజన్ ముగిసినా సాం ఇవ్వకుండా వెన్నుచూపి వెక్కిరించింది. చివరికి రుణమాఫీ కూడా సక్రమంగా పూర్తిచేయకుండా కర్షకులను నట్టేట ముంచింది. ఈ క్రమంలో అన్ని విధాలా గుల్ల అయిన అన్నదాతలకు అప్పులు మరింత పెరిగాయి. పైగా ఇప్పుడు మొదలవుతున్న యాసంగికి కూడా రైతుభరోసా అందుతుందో లేదోనన్న ఆందోళన నెలకొంది. వానకాలానికి పంటల పెట్టుబడి సాయం ఇవ్వని కారణంగా ఒక్క ఖమ్మం జిల్లా రైతులపైనే సుమారు రూ.400 కోట్ల ఆర్థిక భారం పడడం ఆందోళన కలిగించే అంశంగా ఉంది.
ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, అక్టోబర్ 2: కాంగ్రెస్ సర్కారు కారణంగా నాగార్జునసాగర్ నుంచి సాగునీళ్లు రాకపోవడతో ఖమ్మం జిల్లాలోని దాని ఆయకట్టు రైతులు నిరుడు పంటలు వేయలేదు. ధైర్యం చేసి కొందరు రైతులు వేసిన పంటలన్నీ ఎండిపోయాయి. కనీసం తాగునీరు కూడా సరిపడా అందని దుస్థితి. దీంతో వరి దిగుబడులు తగ్గిపోయాయి. ఈ గుణపాఠం కారణంగా ఈ వానకాలంలో సాగుకు దూరంగా ఉందామని ఇక్కడి రైతులు నిర్ణయించుకున్నారు.
అయితే సకాలంలో రుతుపవనాలు రావడం, వర్షాలు కురవడం వంటి కారణాలతో ఊరట చెందిన అన్నదాతలు అనతికాలంలోనే మేల్కొని 4.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇందులో వరి, పత్తి పంటలే రికార్డుస్థాయిలో 4 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. తీరా పెసర పంట చేతికొచ్చే సమయానికి అతి భారీ వర్షాలు కురిశాయి. వరదలు ముంచెత్తాయి. ఫలితంగా వానకాలం పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెసర పంట చేతికిరాకుండా పోయింది. జిల్లాలో 70 వేల ఎకరాల్లో పంటలకు నష్టం కలిగిందంటూ ప్రాథమిక సర్వేలో చెప్పిన వ్యవసాయ అధికారులు.. ఆ తరువాతి సర్వేలో కేవలం 27 వేల ఎకరాల్లోనే నష్టమంటూ ప్రభుత్వానికి నివేదిక పంపారు.
వానకాలం సీజన్లో ఖమ్మం జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో వరిసాగు చేపట్టిన రైతులు.. ఒక్కో ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. రెండో ప్రధాన పంట అయిన పత్తిని మరో 2 లక్షల ఎకరాల్లో సాగుచేస్తూ ఒక్కో ఎకరానికి రూ.35 వేల మేర పెట్టుబడి పెట్టారు. ఇంత పెద్దమొత్తంలో సాగవుతున్న పంటలు దెబ్బతిన్నప్పటికీ కేవలం 27 వేల ఎకరాల్లోనే పంటల దెబ్బతిన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కాగా, ఒక్కో ఎకరానికి రైతులు రూ.30 వేల మేర పెట్టుబడి పెట్టిన రైతులకు ప్రభుత్వం రూ.10 చొప్పున పరిహారమిస్తామంటూ ప్రకటించింది.
కేవలం రూ.27 కోట్ల పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంది. దీంతో మిగిలిన నష్టాన్నంతా అన్నదాతలే భరించాల్సి వస్తోంది. దీనికితోడు వరదలు మిగిల్చిన మేటల తొలగింపు భారం కూడా కర్షకులపైనే పడుతోంది. ఈ మేటల తొలగింపు కోసం ఒక్కో ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకూ ఖర్చయ్యే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఇక 33 శాతం పంట నష్టం జరిగితేనే పరిహారమంటూ ప్రభుత్వం ప్రకటించించడంతో ఆ లోపు పంటలు దెబ్బతిన్న రైతులందరూ పూర్తిగా నష్టపోవాల్సి వస్తోంది. వీరు సుమారు 50 వేల మంది వరకూ ఉండే అవకాశముంది.
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసాకు మంగళం పాడడంతో భద్రాద్రి జిల్లా రైతులు ఆగమాగమయ్యారు. ముఖ్యంగా పోడు పట్టాలు పొందిన ఏజెన్సీ రైతులు అష్టకష్టాలు పడ్డారు. జిల్లా రైతులు ఈ వానకాలం సీజన్లో 4,77,538 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేశారు. అందులో 1,61,731 ఎకరాల్లో వరి; 1,98,268 ఎకరాల్లో పత్తి; 81,242 ఎకరాల్లో జొన్న పంటలు వేశారు. దీంతో సమయానికి పెట్టుబడి సాయం అందకపోవడంతో అధిక మొత్తంలో అప్పులు తెచ్చుకున్నారు. సీజన్ ముగిసినా సాయం అందకపోవడంతో అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయి. దీనికితోడు ప్రకృతి విపత్తులు కూడా అన్నదాతలను వెంటాడడంతో వారు అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు.
2023 గణాంకాల ప్రకారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వానకాలం సీజన్‌కు 3.08 లక్షల మంది రైతులకు ఒక్కో ఎకరానికి రూ.5 వేల చొప్పున సుమారుగా రూ.360 కోట్ల రైతుబంధు పంటల పెట్టబడి సాయాన్ని అందించింది. అయితే తాము ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.7500 చొప్పున అందిస్తామంటూ చెప్పిన కాంగ్రెస్ సర్కారు ఈ సీజన్ ముగిసినా ఇవ్వలేదు. దీంతో రైతుభరోసా పేరిట పెంచిన సాయం రూ.400 కోట్ల మేర ఇవ్వాల్సి ఉండగా మొత్తానికే ఎగనామం పెట్టింది. దీంతో ఆ మొత్తమంతా రైతులు అప్పులతో సమకూర్చుకోవడంతో ఆ భారమంతా వారిపైనే పడింది. మరి యాసంగి సీజన్ సంగతిని ఏం చేస్తారో చూడాలి మరి.
ఈ ఏడాది మా ప్రాంతంలో వర్షాలు మంచిగా కురిసి పంటలు బాగున్నాయి. కానీ సరైన సమయంలో పెట్టుబడి సహాయం అందలేదు. అదీకాక రుణమాఫీ కూడా కాలేదు. దీంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. పనులు వదులుకొని బ్యాంకుల చుట్టూ, పెట్టుబడులకు అప్పు ఇచ్చేవారి చుట్టూ తిరుగుతున్నాం. గత ప్రభుత్వం పెట్టుబడి సహాయం సమయానికి అందించడం వల్ల దర్జాగా వ్యవసాయం చేశాం. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ, రైతుభరోసా వెంటనే ఇవ్వాలని కోరుతున్నాం.
– పాపావత్ రాందాస్, రైతు, మద్రాస్‌తండా గ్రామం, టేకులపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఈ సంవత్సరం వ్యవసాయం ఆశాజనకంగా లేదు. కాలం కూడా అనుకూలించేలా లేదు. వర్షాలు పడకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రైతు భరోసా కూడా అందక అప్పులు చేసి నానా అవస్తలు పడుతున్నాం. ఇప్పటికే అప్పులు చేసి చాలా పెట్టుబడి పెట్టి ఉన్నాం.
– సున్నం మునేష్, రైతు, పుట్టతోగు గ్రామం, ములకలపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా