ఖమ్మం, ఏప్రిల్ 13: ఖమ్మం జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా వేసవిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎండల తీవ్రతకు రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు ఎండిపోయే ప్రమాదం కనిపిస్తున్నది. దీంతో అటు ప్రజలు.. ఇటు రైతులు తాగు, సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తున్నది.
పంట చేతికొచ్చే సమయంలో ఎండిపోతుండడం వల్ల రైతులు బోర్లు వేస్తున్నా అవి పడటం లేదు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోవడం ఒక భాగమైతే.. చేతికొచ్చిన పంట ఆగమవుతుందనే బెంగ మరోవైపు రైతులను కుంగదీస్తున్నది. ఒక్కో బోరు వేయడానికి సగటున రూ.50 వేలు ఖర్చు అవుతుండగా.. నీళ్లు పడకపోవడం వల్ల ఒక్కో రైతు కనీసం నాలుగు బోర్లు వేస్తున్నాడు.
ఏదో ఒక్కటైన పడి నీళ్లు వస్తాయనే ఆశతో అప్పు తెచ్చి మరీ బోర్లు వేస్తున్నారు. ఇటీవల ఖమ్మం రూరల్ మండలం, ఎం.వెంకటాయపాలెంకు చెందిన రైతు ఏకంగా తన చేలో నాలుగు బోర్లు వేసినా నీళ్లు పడలేదు. ఖమ్మం జిల్లాలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురకవపోవడం వల్ల చెరువులు, కుంటలు నిండని పరిస్థితి ఉంది. ఐతే నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలోని చెరువులను మాత్రం సాగర్ నీళ్లతో నింపడం వల్ల వాటిల్లో కొద్దిగా నీరు ఉంది.
తద్వారా వాటి ఆయకట్టు పరిధిలోని పంటలు చేతికొచ్చే అవకాశం మాత్రం ఉంది. సాగర్ ఆయకట్టులేని ప్రాంతాల్లోని రైతులు మాత్రం అగమ్యగోచరమైన స్థితిలో ఉన్నారు. వరి పంటలతోపాటు మిర్చి తోటలు కూడా ఎండిపోతున్నాయి. ఖమ్మం జిల్లాలో 2024 మార్చిలో సరాసరి భూగర్భ జలాలు 6.86 మీటర్లు కాగా.. ఈ ఏడాది మార్చిలో 5.51 మీటర్లు ఉన్నవి. గత ఏడాది కంటే నీటిమట్టాలు పడిపోతున్నవి.
ప్రమాదకరంగా భూగర్భ జలాలు
ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో గత ఏడాది కంటే ఈ ఏడాది భూగర్భ జలాలు తగ్గుతుండడంతో ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. సాగునీటి అవసరాలు ఈ నెలాఖరు నుంచి లేనప్పటికీ తాగునీటికి కటకట ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ముఖ్యంగా గత ఏడాదితో పోలిస్తే కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, బోనకల్, చింతకాని, ముదిగొండ, కొణిజర్ల, సింగరేణి, ఎర్రుపాలెం, రఘునాథపాలెం, సత్తుపల్లి, తల్లాడ మండలాల్లో భూగర్భ జలాలు తగ్గాయి. మార్చిలోనే ఈ విధంగా ఉంటే.. ఏప్రిల్, మే నెలలో మరింత కిందికి వెళ్లే ప్రమాదం ఉంది. తాగునీటి ఎద్దడి నివారణకు అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం గమనార్హం.
ప్రధాన జలాశయాల్లో తగ్గుతున్న నీటిమట్టం
ఖమ్మం జిల్లాలో చెరువులు, కుంటలతోపాటు ప్రధాన జలాశయాలు మూడు ఉన్నాయి. వాటిలో పాలేరు, వైరా, లంకాసాగర్ ప్రాజెక్టు ఉండగా.. వీటిలో కూడా నీరు తగ్గుతూ వస్తున్నది. పాలేరు జలాశయం కెపాసిటీ 23 అడుగులు కాగా.. ప్రస్తుతానికి 22 అడుగులకు నీరు చేరింది. ఇక్కడి నుంచే ఖమ్మం కార్పొరేషన్‌కు తాగునీటి సరఫరా జరుగుతున్నది.
ఈ జలాశయంలో నీటిమట్టం మరింత తగ్గితే ఖమ్మం ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పవు. అదేవిధంగా వైరా ప్రాజెక్టు కెపాసిటీ 17 అడుగులు కాగా.. ఇక్కడ 13 అడుగులు మాత్రమే నీరు ఉంది.. ఇక్కడ కూడా నీటిమట్టం మరింత తగ్గితే వైరా, మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పవు. లంకాసాగర్ ప్రాజెక్టులో కూడా ఇదే పరిస్థితి ఉంది.