ఖమ్మం రూరల్, ఏప్రిల్ 21 : వేసవి కాలం ఎండలను దృష్టిలో పెట్టుకుని ప్రజల దాహార్తి తీర్చేందుకు ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మంగళవారం గ్రామ సర్పంచ్ ఆరెంపుల రమాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దని సూచించారు. ఖమ్మం నుండి తిరుమలాయపాలెం వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు, కూలీలు, ప్రజలు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ హనుమంతరావు, పంచాయతీ సిబ్బంది అరేంపుల ఉపేందర్, ఎంఎల్హెచ్పీ డా.అమూల్య, ఆశా వర్కర్ నాగమణి, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మహేష్, పోస్టుమెన్ ఎన్.గోపాలకృష్ణ, గ్రామస్తులు గునిగంటి వినయ్, మల్లెల వీరయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.