– దుర్వాసన, దోమలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
కరకగూడెం, మే19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన సైడు కాల్వ అధ్వానంగా మారింది. దుర్వాసన భరించలేపోతున్నామని, దోమలు విజృంభిస్తుండడంతో తరుచూ అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. నిర్వహణ పేరిట ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు. ప్రధాన రహదారికి రెండు వైపులా ఫుట్ పాత్ ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్నా వ్యాపారులపై ఎటువంటి చర్యలు లేకపోవడం పంచాయతీ అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరుకు రహదారి కావడంతో పాటు అందుకు అనుగుణంగా డ్రైనేజీల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో కాల్వల్లో చెత్త పెరుకుపోయి మురుగునీరు పారడం లేదు.
‘ పన్నులు చెల్లిస్తున్నా… కనీస మౌలిక సదుపాయాలు కల్పించండి’ అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొన్ని నెలలుగా కాలువల్లో పూడిక తొలిగించక మురుగునీరు నిలిచి దోమలు, దుర్గంధంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎండాకాలమే ఇలా ఉంటే రాబోయే వానాకాలంలో పారిశుధ్యం పరిస్థితి ఎలా ఉండనుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని సైడు కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మురుగునీరును తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై ఎంపీడీఓ దేవర కుమారును వివరణ కోరగా మరుగునీరు వెళ్లడానికి దారి లేకపోవడంతో పాటు కాలువ నిర్మాణం అడ్డదిడ్డంగా కట్టడంతో సమస్య ఉత్పన్నమవుతుంది. ఫుట్పాత్ ఆక్రమణల విషయం పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.

కరకగూడెంలో అధ్వాన్నంగా డ్రైనేజీలు