ఖమ్మం వ్యవసాయం, జనవరి 16: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో ఏటా జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై సవాలక్ష సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిరుడు జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. తాజాగా బుధవారం జరిగిన అగ్ని ప్రమాదం కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నది. అయితే, ఈ మిస్టరీలు ఏంటనేది అధికారులు ఇప్పటికైనా నిగ్గుతేలుస్తారా? లేదా? అనే అంశంపై అటు అన్నదాతలు, ఇటు వ్యాపారులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.ఖమ్మం ఏఎంసీ పత్తి యార్డులో గత ఏడాది కూడా అచ్చం ఇదే తరహాలో అగ్నిప్రమాదం జరిగింది.
కాకపోతే అప్పుడు తెల్లవారుజామున ప్రమాదం జరగగా.. ఇప్పుడు రాత్రివేళ ప్రమాదం సంభవించింది. అయితే.. నిరుడుగానీ, ఇప్పుడుగానీ కాలిపోయిన పంట మాత్రం ఖరీదుదారులదే కావడం గమనార్హం. ‘దాదాపుగా ఏటా ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రమాదం జరిగిన తరువాత అందుకు కారణం ఏమిటి?’ అనే ప్రశ్నలకు సమాధానాలను అటు ఏఎంసీ అధికారులు గానీ, ఇటు పోలీసులు గానీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత శాఖల అధికారులు ఒకటి రెండు రోజులు హడావిడి చేయడం తప్ప.. సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలు శూన్యమని రైతులు, వ్యాపారుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ..
ఖమ్మం మార్కెట్ అంటేనే సాంకేతిక పరిజ్ఞానానికి కొదవ లేదనే మాట ఉంది. మూడు యార్డుల్లో జరిగే క్రయవిక్రయాలను నిశితంగా పరిశీలించేందుకు అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రధాన గేట్ నుంచి ఓ మనిషి ప్రవేశిస్తే.. అతడు నిఘా నీడలో ఉన్నట్లే. ఇంతటి వ్యవస్థ కలిగిన యార్డుల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుండడం ఒక ఎత్తు అయితే.. అవి ఎలా జరిగాయనేది అంతు చిక్కకపోవడం మరో ఎత్తులా కన్పిస్తున్నది. నిరుడు పత్తి యార్డులో ప్రమాదం జరిగిన సమయంలో ఆక్కడి షెడ్లకు అసలు కరెంట్ సరఫరా లేదని, సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో ఎలాంటి ఆనవాళ్లూ కనపడలేదని అధికారులు అప్పట్లోనే వెల్లడించారు. అయినప్పటికీ బయటకు మాత్రం విద్యుదాఘాతం కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పారు.
అదే అంశాన్ని పొందుపరుస్తూ నివేదిక తయారు చేశారు. కొద్ది నెలల తరువాత బాధిత వ్యాపారికి బీమా రూపంలో పరిహారం సైతం అందింది. కానీ.. ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని మాత్రం అధికారులు బహిరంగ పరచలేదు. అచ్చం అదే తరహాలో బుధవారం రాత్రి కూడా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో గురువారం యార్డును పరిశీలించిన ప్రతి ఒక్కరూ ఇవే విషయాల గురించి చర్చించుకున్నారు. అనేక అనుమానాలు లేవనెత్తారు. ‘పత్తి యార్డులో ప్రమాదం జరిగితే నిజం బయటకు ఎలా వస్తది?’ అనుకుంటూ మాట్లాడుకోవడం గమనార్హం. కానీ.. ఘటనా స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం జరగడానికి ప్రధాన కారణమేంటనేది తేల్చి స్పష్టమైన నివే దిక అందజేయాలని ఆదేశించారు. కానీ.. ‘తరచూ జరుగుతున్న ప్రమాదాలకు కారణం ఆకతాయిల పనా?, విద్యుదఘాతమా?, లేక ఇంకా ఏదైనా కారణమా?’ అనేది తేలాల్సి ఉంది. కానీ.. అధికారులు ఈసారైనా ఈ ప్రమాదంపై అసలు విషయాన్ని నిగ్గు తేలుస్తారా? లేక గతంలో మాదిరిగానే షరా మామూలే అని దాటవేస్తారా? అనే విషయం తేలాల్సి ఉంది.