మామిళ్లగూడెం, జూన్ 15 : సైబర్ నేరగాళ్లు పంపిస్తున్న లింకులు, మెసేజ్‌లకు స్పందించి మోసపోవద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్బీఐ యూనో అప్లికేషన్స్ ఉపయోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఏ బ్యాంక్ అయినా అప్డేట్ కోసం వివరాలు అడగవని, మోసపూరిత మెసేజ్‌లలో వచ్చిన లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరగాళ్లు డాటాలో ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా మీ అకౌంట్లో రివార్డు నగదు జమ అవుతుందని, మీ కేవైసీ అప్డేట్ కాలేదని, మీ ఎస్బీఐ యూనో అకౌంట్ బ్లాక్ అయిందని, అన్ బ్లాక్ కోసం పాన్ కార్డ్ నంబర్ లింకులో నమోదు చేస్తే అప్డేట్ అవుతుందని మెసేజ్ పంపిస్తూ మోసం చేస్తున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఏదో ఆశ చూపి వల వేస్తుంటారని, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా ఫోన్లో మాట్లాడి ఏదైనా సీమ్ గురించి చెబితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో పడి మోసపోతే.. వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే నగదును రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.