కొత్తగూడెం ప్రగతి మైదాన్, అక్టోబర్ 28 : గంజాయి రవాణా చేసేవారినే కాదు.. దాన్ని సేవించేవారిని సైతం వదిలిపెట్టొద్దని ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు అన్నారు. జిల్లాలోని అన్ని సబ్డివిజన్ల పోలీస్ అధికారులతో ఎస్పీ తన కార్యాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి రవాణాను అరికట్టడంలో పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి సేవించే వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు.
‘చైతన్యం- డ్రగ్స్‌పై యుద్ధం’ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న గంజాయి హాట్‌స్పాట్స్‌ను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు. పోలీస్స్టేషన్లలో నమోదయ్యే ప్రతి కేసులో ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ ద్వారా పూర్తిస్థాయిలో విచారణలు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలన్నారు. పెట్రో కార్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిత్యం ప్రజల్లో తిరుగుతూ వారికి అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాలు, కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ట్రాఫిక్ నియమాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్, పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీష్‌కుమార్, ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, మణుగూరు డీఎస్పీ వి.రవీందర్‌రెడ్డి, జిల్లాలోని అన్ని విభాగాలు, స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.