వేంసూరు, జనవరి 16: ఆసుపత్రికి వచ్చే రోగులతో మర్యాదగా వ్యవహరించాలని, విధుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హెచ్చరించారు. వేంసూరు పీహెచ్సీ, తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో మందుల నిల్వలు, గర్భిణులకు అందుతున్న సేవలు, ఆసుపత్రి నిర్వహణ తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నామనే ఆలోచనా విధానంతో వైద్యులు, సిబ్బంది పని చేయాలన్నారు. సేవా దృక్పథంతో పని చేయడం వైద్య శాఖలో చాలా అవసరమన్నారు.
అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడానికి వీల్లేదని, సిబ్బంది సకాలంలో హాజరుకావాలన్నారు. అలాగే ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు, సిజేరియన్లు ఎన్ని చేశారని అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, ఈ దిశగా గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. మందుల స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని, కొరత లేకుండా చూసుకోవాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్.. ఇక్కడి సిబ్బంది పనితీరుపై ఫిర్యాదులు అందుతున్నాయని, పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజలకు సేవలు నిర్ణీత కాలంలోగా అందజేయాలని, ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం లో తహసీల్దార్ ఎంఏ.రాజు, వైద్యాధికారులు డాక్టర్ కే.ఇందుప్రియాంక, డాక్టర్ కే.శ్రీ విద్య, డాక్టర్ హసీ న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.