ఖమ్మం సిటీ, నవంబర్ 27: వివిధ అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యమూ కలిగించొద్దని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ కళావతిబాయి ఆదేశించారు. వారికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఖమ్మం వైఎస్ఆర్ నగర్‌లోని బస్తీ దవాఖానను బుధవారం ఆమె తనిఖీ చేశారు.
ఓపీ వైద్య సేవలు, ఫార్మసీ స్టోర్, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ మాతా, శిశు సంక్షేమం, వ్యాధి నిరోధక టీకాలు, అసంక్రమణ వ్యాధులను అరికట్టే కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. వ్యాక్సిన్ నిల్వలు, కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ చేస్తూ పిల్లలకు టెక్నికల్‌గా ఏ ఇబ్బంది కలుగకుండా అందించాలన్నారు. అదేవిధంగా అన్ని రకాల సేవలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలని ఆమె ఆదేశించారు.