కొత్తగూడెం క్రైం/ భద్రాచలం/ తిరుమలాయపాలెం/ రామవరం, ఫిబ్రవరి 25: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. ఇందులో ముగ్గురు వైద్య విద్యార్థులు, ఒకరు హోటల్ మేనేజ్మెంట్(హెచ్ఎం) విద్యార్థి ఉన్నారు. భద్రాచలానికి చెందిన బోగాల శ్రీనివాసరెడ్డి కుమారుడు భూపతిరెడ్డి, రాజుపేట కాలనీకి చెందిన మల్లం వివేక్ చెర్నీ ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. రుద్రంపూర్ 4 ఇైంక్లెన్కు చెందిన సింగరేణి అధికారి సొప్పరి రమేశ్‌కుమార్, సరయు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతోంది. తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లికి చెందిన రావుల ఉపేందర్‌రెడ్డి కుమారుడు మహేశ్‌రెడ్డి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నాడు. అయితే ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తుండడంతో అక్కడ జనజీవనం స్తంభించింది. దీంతో వీరంతా అక్కడ చిక్కుకుపోయారు. ఈ నెల 23 సాయంత్రం నుంచి అక్కడ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. కాగా, తమ పిల్లలను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రస్తుతం రావుల మహేశ్‌రెడ్డి ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఉన్నాడు. శనివారం ఉదయం 8 గంటలకు తమ హాస్టల్ నుంచి పొరుగు దేశంలోని సరిహద్దు వరకు బస్సులను ఏర్పాటు చేసినట్లు విద్యార్థిని సరయు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపింది. ఆ దేశం నుంచి ఇండియాకు పంపుతామని కాలేజీ యాజమాన్యం చెప్పినట్లు ఆమె తెలిపింది.
ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో జిల్లా వాసులు ఎవరైనా అక్కడ చిక్కుకుపోయి ఉంటే వారి కుటుంబ సభ్యులు ఇక్కడి పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్ శుక్రవారం తెలిపారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా భద్రాద్రి జిల్లాకు చెందిన వారెవరైనా ఉక్రెయిన్‌లో ఉంటే వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు జరుగుతాయన్నారు. కుటుంబీకులు కొత్తగూడెంలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌ను 08744-242097 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.