మామిళ్లగూడెం, మార్చి 14 : వచ్చే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు రెండు రాష్ర్టాల సరిహద్దుల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు పోలీసుల మధ్య భద్రతా ఏర్పాట్లపై ఏపీ రాష్ట్రం మైలవరం ఏసీపీ కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మద్యం, నగదు నియంత్రణపై చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధానంగా అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా పోలీస్ ప్రవేశ, నిష్రమణ మార్గాల్లో 24/7 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా సమన్వయంతో ముందుకెళ్లాలని అధికారులు సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ విషయంలో ఇరు జిల్లాలు, రాష్ర్టాల అధికారులు సహకరించుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయించారు. గతంలో అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, నియంత్రణకు ప్రణాళిక రూపొందించాలన్నారు.
సరిహద్దుల్లో హైవే పెట్రోలింగ్, మొబైల్ పెట్రోలింగ్ పెంచాలని, వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. జిల్లా సరిహద్దుల్లో ఉన్న సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో మైలవరం ఏసీపీ ఎస్.మురళీమోహన్, నందిగామ ఏసీపీ డాక్టర్ బి.కిరణ్కుమార్, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఏస్బీ ఏసీపీ పార్థసారథి, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, కల్లూరు ఏసీపీ రఘు, వైరా ఏసీపీ రహెమాన్, ఖమ్మం జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ ప్రసన్నకుమార్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.