ఖమ్మం : జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గిడ్డంగిని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ శుక్రవారం తనిఖీ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపే పిరియాడికల్ తనిఖీ నివేదిక సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ పరిశీలించారు. ఈవిఎం గిడ్డంగుల వద్ద అక్కడి సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. గిడ్డంగిలో అగ్నిమాపక పరికరాలను జిల్లా అగ్ని మాపక శాఖాధికారితో తనిఖీ చేయించి అవసరమైన పరికరాలను మార్చాలని ఆదేశించారు.
గిడ్డంగుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తుండాలని పోలీసు సిబ్బందికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, డీఆర్వో శిరీష, జిల్లా అగ్నిమాపకశాఖాధికారి జయప్రకాష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కర్రి.కృష్ణ, మిరియాల నాగరాజు, విద్యాసాగర్, తాజుద్దీన్, గోపాల్, సింగు నర్సింహారావు, ప్రకాష్, ఎన్నికల విభాగపు సూపరిండెంట్ రాంబాబు పాల్గొన్నారు.