ఆడబిడ్డలకు చీరె అపురూపం.. పండుగ పూట నచ్చిన చీరె కట్టుకుని మురిసిపోతూ ఉంటే ఆ ఇంటికి వచ్చే కళే వేరు.. బతుకమ్మ, దసరా సందర్భంగా ప్రతి ఇంటికీ ఆ కళను తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు అన్నగా ఏటా మహిళలకు చీరెలు పంపిణీ చేస్తున్నారు. వారి మోములపై చిరునవ్వులు పూయిస్తున్నారు. మురిపెంతో చీరెను ముద్దాడే వేడుక తీసుకొచ్చారు. బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘బతుకమ్మ చీరెల పంపిణీ ప్రారంభమైంది. ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, పెనుబల్లిలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, భద్రాచలంలో ఎమ్మెల్సీ తాతా మధు, మధిర నియోజకవర్గంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లిలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జూలూరుపాడు, కొణిజర్లలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ పంపిణీ చేశారు. వేదికల వద్ద రకరకాల డిజైన్ల చీరెలు.. రంగు రంగుల చీరెలను చూస్తూ మహిళలు సందడి చేశారు. బతుకమ్మ కానుక అందించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ఆడపడుచులకు ప్రీతిపాత్రమైన పండుగ.. సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే వేడుక.. ఆడబిడ్డలు మెట్టింటి నుంచి పుట్టింటికి వచ్చి జరుపుకునే బతుకమ్మ పండుగ. పేద ధనిక తేడా లేకుండా మహిళలందరూ కొత్త చీరెలు ధరించి జరుపుకునే వైభవోపేతమైన పండుగకు సీఎం కేసీఆర్ ఏటా చీరెలు పంపిణీ చేయడం ఆనవాయితీ. తెలంగాణ సిద్ధించిన తర్వాత సర్కారు కానుకగా అందించే చీరెలు ధరించి మహిళలు పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంత్రి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మహిళలకు బతుకమ్మ చీరెలను పండుగ వాతావరణంలో బుధవారం పంపిణీ చేశారు. సంతోషంగా చీరెలు అందుకున్న మహిళలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. – నమస్తే నెట్వర్క్
బతుకమ్మ చీరెలు బాగున్నాయి
సత్తుపల్లి రూరల్, అక్టోబర్ 4 : ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా కానుకగా అందించిన చీరెలు చాలా బాగున్నాయి. రంగురంగుల డిజైన్లతో చీరెలు అందంగా ఉన్నాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చీరెలు పంపిణీ చేయడం హర్షణీయం. సీఎం కేసీఆర్ ఆడబిడ్డల కానుకగా చీరెలు పంపిణీ చేయడం శుభపరిణామం.
– లింగబోయిన నాగమణి, సదాశివునిపాలెం
పండుగకు శోభనిచ్చే చీరెలు
పండుగకు ముందుగానే సీఎం కేసీఆర్ మహిళలందరికీ బతుకమ్మ కానుకగా చీరెలు పంపిణీ చేశారు. ఈ చీరలు బతుకమ్మ పండుగకు ముందే పంపిణీ చేయడంతో మహిళలంతా సంతోషంగా పండుగ చేసుకునేందుకు ఉపయోగపడుతాయి. రంగురంగుల డిజైన్లతో నాణ్యత గల చీరెలు పంపిణీ చేయడం అభినందనీయం.
– తిరునగరి సంధ్యారాణి, సదాశివునిపాలెం
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు కానుకగా సీఎం కేసీఆర్ ఏటా బతుకమ్మ చీరెలు అందించడం అభినందనీయం. రంగురంగుల నాణ్యత గల చీరెలు వారి అభిరుచులకు అనుగుణంగా తయారు చేసి అందించడంతో మహిళలంతా సంతోషంగా బతుకమ్మ పండుగకు సిద్ధమవుతున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– యేసూరి లత, సదాశివునిపాలెం