ఖమ్మం, జనవరి 4: జిల్లాలో శనివారం నుంచి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. గత నెల వరకు ఒక్కొక్కరికీ 10 కేజీల చొప్పున ఉచితంగా ఇచ్చిన రేషన్ బియ్యాన్ని ఈ నెలలో ఒక్కొక్కరికీ 5 కేజీల చొప్పు న అందించేలా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గురువారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా ఉచిత బియ్యాన్ని నిరుపేదలకు రేషన్ డీలర్లు అందించనున్నారు. ఇప్పటికే జిల్లాలోని 8 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా ఖమ్మం జిల్లాలోని 711 రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేశారు.
జిల్లాలో 4,12,743 ఆహార భద్రత కార్డులు ఉండగా 11,41,601 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ 5 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నారు. వీరితోపాటు అంత్యోదయ కార్డుదారులకు ఒక్కొక్క కార్డుకు 35 కేజీల చొప్పున, అన్నపూర్ణ కార్డుదారులకు ఒక్కొక్క కార్డుకు 10 కేజీల చొప్పున అందించనున్నారు. వీరందరికీ ఈ నెలలో 5,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా అందజేయనున్నారు.
ఈ ఏడాదంతా ఉచిత బియ్యమే..
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని నిరుపేదలందరికీ ఆహార భద్రత కార్డుల ద్వారా ఉచిత బియ్యం అందిస్తోంది. గత కొవిడ్ సమయం నుంచి గత ఏడాది డిసెంబర్ వరకు ప్రతి ఒక్కరికీ ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఆహార భద్రత కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికీ 10 కేజీల చొప్పున ఎంతమంది కుటుంబ సభ్యులుంటే అంతమందికి 10 కేజీల చొప్పున పంపిణీ చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ 5 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ చేసేలా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.