ఖమ్మం సిటీ, మార్చి 24:వారంతా దివ్యాంగులు. కాయకష్టం చేయలేనప్పటికీ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన చేయూతతో ఆత్మగౌరవంతో బతుకు బండిని నెట్టుకొస్తున్నారు. కానీ, కనికరంలేని కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగం వారినీ వదలట్లేదు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే రోడ్డు మీదకు నెట్టేస్తోంది. దీంతో ‘మేము దివ్యాంగులమయ్యా.. కలెక్టర్ సారూ కరుణించండి..’ అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దాదాపు పన్నెండేళ్లుగా పదిహేను మంది దివ్యాంగులు బైక్ పార్కింగ్ స్టాండ్ నిర్వహించుకుంటూ జీవిస్తున్నారు.
అప్పట్లో అరకొరగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో సర్కారు ఆసుపత్రులు బలోపేతమయ్యాయి. దీంతో ఆయా ఆసుపత్రులకు రోగుల తాకిడి కూడా గణనీయంగా పెరిగింది. తద్వారా రోగుల సహాయకుల రాకతో వాహనాల రద్దీ ఆశాజనకంగా మారింది. ఈ క్రమంలో కొందరు ఇచ్చినా, మరికొందరు లేవని వెళ్లిపోయినా దివ్యాంగులకు కొంతమేరకు ప్రయోజనం చేకూరింది. ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడకుండా గౌరవంగానే బతుకుతూ వస్తున్నారు.
కాగా, ఇటీవల పలుమార్లు ఖమ్మం పెద్దాసుపత్రి తనిఖీలకు వచ్చిన కలెక్టర్.. పార్కింగ్ సమస్యపై దృష్టి సారించారు. అంతవరకూ బాగానే ఉన్నా.. పార్కింగ్ నిర్వహణ కోసం టెండర్లు పిలవాలంటూ వైద్యాధికారులకు ఆదేశాలు ఇచ్చి వెళ్లారు. ఆ ఆదేశం.. దివ్యాంగుల జీవితాల పట్ల ఆశనిపాతంగా మారింది. జిల్లా ఉన్నతాధికారి జారీ చేసిన మౌఖిక ఆదేశాలకు అనుగుణంగా పెద్దాసుపత్రి యంత్రాంగం పార్కింగ్ స్టాండ్‌కు టెండర్లు పిలవాలని భావించింది. ఈ ప్రక్రియ జరిగితే ఏదో ఒక ఏజెన్సీ రంగంలోకి దిగడం, అభాగ్యులు రోడ్డున పడడం ఖాయం. ఈ నేపథ్యంలో తాము దివ్యాంగులమని, తమపై దయ చూపాలని వేడుకుంటూ సదరు దివ్యాంగులు మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.