కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూలై 3 : వర్షాలు, వరదలతో సంభవించే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అందరూ సమష్టిగా పని చేయాలని, ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా నిలవాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఎస్పీ తన కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో డీడీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, 6వ బెటాలియన్, టీజీఎస్పీ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల్లో ప్రమాదవశాత్తు చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5 డీడీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన డీడీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో నివసించే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సంరక్షించేందుకు ఈ బృందాలు నిత్యం అందుబాటులో ఉంటాయన్నారు.
రెస్క్యూ సమయంలో అవసరమయ్యే లైవ్ జాకెట్స్, లైఫ్ బాయ్ రింగ్స్, బోట్ పెడల్స్, రోప్స్, ఇతర సామగ్రి మొత్తాన్ని బృందాలకు సమకూర్చామన్నారు. భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విపత్కర సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి పోలీస్ శాఖ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ(ఆపరేషన్స్) గోపతి నరేందర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మురహరి క్రాంతికుమార్, 6వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్, ఆర్ఐ(ఆపరేషన్స్) బోలెం రవి, పీఆర్వో దాములూరి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.