ముదిగొండ, ఏప్రిల్ 30 : ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తమకూ ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముదిగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట బుధవారం పలువురు దివ్యాంగులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఎంపిక చేస్తున్న జాబితాలో ఒక్క దివ్యాంగుడు కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లలో 5 శాతం దివ్యాంగులకు కేటాయిస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రాధాన్యం ఇచ్చే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బొజ్జ జీవరత్నం, గుంజులూరి వీరబాబు, సీతారాములు, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.