మధిర, మార్చి 26 : కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను తక్షణమే అమలు చేయాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం జిల్లా చింతకాని మండల తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి నెరవేర్చలేని వాగ్దానాలు ఎన్నో చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ నేటికి కాకపోవడం సిగ్గుచేటు అన్నారు. అంతే కాకుండా ఐదు ఎకరాల లోపల రైతు భరోసా ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని నేటి వరకు కూడా అది మొదలు పెట్టలేకపోవడం బాధాకరమన్నారు. మహిళలకు రూ.2,500, నిరుద్యోగ భృతి, ఉపాధి కూలీలకు రూ.12,500 ఏడాదికి జమ చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా జమ చేయలేదన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ అబద్దాలకు అంతే లేదన్నారు.
అధికారం దక్కించుకున్న తర్వాత హామీలను విస్మరించడం దారుణమన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం తాసీల్దార్ అనంతరాజుకు వినపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రైతు సంఘం మాజీ రాష్ట్ర నాయకుడు మునికుంట్ల సుబ్బారావు, వందనం మాజీ సర్పంచ్, సీపీఎం సీనియర్ నాయకుడు రాఘవరెడ్డి, మండల కార్యదర్శి రాచబంటి రాము, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వత్సవాయి జానకి రాములు, మండల కమిటీ సభ్యులు మద్దిని బసవయ్య, మడిపల్లి కిరణ్ బాబు, నాన్నక కృష్ణమూర్తి, గడ్డం రమణ లింగం, కోటేశ్వరరావు, మాదిని రవి, నక్కనబోయిన శాంతారావు పాల్గొన్నారు.