ధరణి. రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక పోర్టల్ ఇది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అతిగొప్ప మార్పు. ధరణి రాకముందు వరకు రైతులు రిజిస్ట్రేషన్ కోసం అరిగోస పడ్డారు. మ్యూటేషన్ కోసం ముప్పు తిప్పలు పడ్డారు. చివరికి పహణీ కావాలన్నా.. పడిగాపులు కాయాల్సి వచ్చేది. కొంతమంది భూములైతే ఏకంగా రికార్డుల నుంచే మాయమయ్యేవి. చిన్నాపెద్దా తేడాలేకుండా అరెకరం రైతు దగ్గర నుంచి వంద ఎకరాల ఆసామి వరకు అప్పట్లో పడిన బాధలు వర్ణణాతీతం. ఎందరో రైతులు రెవెన్యూ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరగలేక ఉసురు తీసుకున్నారు. ఇటువంటి సమస్యలన్నింటికీ నేడు ‘ధరణి’ సమాధానమై నిలిచింది. భూ రికార్డులన్నీ పోర్టల్‌లో భద్రంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు సులభమయ్యాయి. మ్యూటేషన్ తక్షణమే. కొద్దిరోజుల్లోనే చేతికి పట్టా అందుతున్నది. అయితే రైతు వేలిముద్ర లేనిదే ఇంచుభూమి కూడా మార్పిడి జరిగే అవకాశమే లేదు. అందుకే అయ్యింది రైతులందరికీ ‘ధరణి’ ఒక ధైర్యం.
అశ్వారావుపేట, మే 27 : వ్యవసాయ భూములకు పూర్తి భద్రత కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ వ్యవస్థ రైతులకు ధైర్యానిస్తున్నది. గతంలో రికార్డుల నిర్వహణ అక్రమాలు, నకిలీలకు అనువుగా ఉండేవి. రెవెన్యూ అధికారులు రైతుల భూ హక్కులను కాలరాస్తూ దుర్వినియోగానికి పాల్పడి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎందరో రైతుల ఉసురు తీశారు. దీంతో అనేక అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కనీస భద్రత, ధైర్యం కల్పించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో స్వరాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అవినీతిరహిత సేవలు, రైతు భూ హక్కులకు భద్రత కల్పించేలా ‘ధరణి’ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటివరకు రికార్డులు క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటంతో తారుమారు అయ్యాయి.
ధరణి సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత భూ రికార్డుల నిర్వహణ ధరణి పోర్టల్‌లో భద్రంగా ఉండడం, అవసరమైనప్పుడు ఆన్లైన్లో కిక్ల్ చేస్తే వివరాలు కళ్ల ముందు ప్రత్యక్షం కావడంతో రైతులకు మనోైస్థెర్యాన్ని కలిగించింది. అంతేకాకుండా భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సేవలను తహసీల్దార్ కార్యాలయంలో జరిగేవిధంగా అందుబాటులోకి తీసుకురావడంతో దూరాభారం తగ్గడం, రోజుల తరబడి వేచి ఉండే సమస్య లేకుండా లావాదేవీలు తక్షణం పూర్తిచేసేలా సులభతరం చేయడం రైతులకు సమయం ఆదా అవుతున్నది. అలాగే తక్షణ మ్యూటేషన్‌కు ఆస్కారం కల్పించడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థలో తిష్టవేసిన అవినీతి, అక్రమాలపై 2020వ సంవత్సరంలోనే ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ‘ధర్మగంట’ శీర్షికతో వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ శీర్షికపై అన్నివర్గాల రైతులు ఆనందం వ్యక్తం చేయడమే కాకుండా అండగా నిలిచారు. ‘ధర్మగంట’ ద్వారా ఎందరో రైతులు తనమ సమస్యలు, గోడును విన్నవించుకున్నారు. దీనికి అనుగుణంగానే రైతుల సంక్షేమం, భూహక్కులకు భద్రత, భరోసా కల్పించేలా ‘ధరణి’ పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చారు.
‘ధరణి’ రాకముందు..
గతంలో భూ క్రయ, విక్రయాలు వ్యయప్రాయాసలతో కూడుకున్నది. ముందుగా రికార్డులను సరిచూసుకుని డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లాల్సి వచ్చేది. తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీసుకు వెళ్లి రోజంతా పడిగాపులు పడిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అయ్యేది. మరుసటి రోజు రిజిస్ట్రర్ డాక్యుమెంట్‌ను తీసుకుని రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి మ్యూటేషన్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకుని కార్యాలయం చుట్టూ తిరగాల్సి ఉండేది. అధికారుల దయాదాక్షిణ్యాలతో మ్యూటేషన్ ప్రక్రియ కోసం రోజుల తరబడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. అంతేకాకుండా పహాణీ కోసం ప్రతి ఏటా రెవెన్యూ కార్యాలయానికే పరుగులు తీయాల్సి వచ్చేది. పాసు పుస్తకం కోసం మరికొన్ని రోజులు పట్టేది. దీనికోసం కొన్నిరోజుల పాటు రెవెన్యూ కార్యాలయానికి టైం కేటాయించాల్సి వచ్చేది. ఇంతలో ఎంతో ఖర్చు, సమయం వృథా అయ్యేది.
ధరణి వచ్చాక..
రెవెన్యూ వ్యవస్థలోనే తెలంగాణ సర్కార్ ‘ధరణి’తో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఒక్క రోజులోనే ప్రక్రియ అంతా పూర్తి అవుతోంది. రికార్డులు సరి చూసుకున్న తర్వాత మీ సేవలో దరఖాస్తు చేసుకుని రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే వేలి ముద్రలు తీసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తారు. ఇక్కడ ఏ సందర్భంలోనూ రికార్డులు కాగితాలపై ఉండవు. అంతా ఆన్లైన్లోనే ప్రక్రియ సాగుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తికాగానే వెనువెంటనే మ్యూటేషన్ కూడా ముగుస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత తహసీల్దార్ రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. కొద్దిరోజుల్లోనే నేరుగా రైతు ఇంటికే పాసు పుస్తకం వచ్చేస్తుంది. ప్రతి ఏటా రెవెన్యూ కార్యాలయానికి వెళ్లకుండా మీసేవా కేంద్రాల్లో పహాణీ, 1బీ ఎప్పుడంటే అప్పుడు తీసుకునే వీలుంది.
వారసత్వంగా భూమిని పొందాము
మా అమ్మగారు మృతిచెందిన తర్వాత ఆమె వారసత్వంగా వ్యవసాయ భూమిని అన్నదమ్ములం పంచుకోవాలని అనుకున్నాం. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాం. అక్కడ ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని రమ్మన్నారు. వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోయింది. భూ హక్కులు మా పేరున బదిలీ అయ్యాయి. ధరణి సేవలు చాలా కచ్చితంగా, త్వరగా అందుతున్నాయి. రిజిస్ట్రేషన్ కోసం 10సార్లు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన సమస్య తప్పింది.
– పందేటి వెంకటేశ్వరరావు, రైతు, దమ్మపేట
భూ రికార్డులు పూర్తి భద్రం
గతంలో పోల్చితే భూ రికార్డులకు ధరణి పోర్టల్ ద్వారా పూర్తి భద్రత ఉంది. ధరణి రాకముందు రెవెన్యూ అధికారుల చేతిరాతలతో ఎన్నో అక్రమాలు జరిగాయి. ఇప్పుడు అంతా ఆన్లైన్ ప్రక్రియ కావడంతో భూ హక్కులకు ఎలాంటి సమస్య ఉండదు. రికార్డులు అవసరమైనప్పుడు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఆన్లైన్లోనే వివరాలు అన్ని తెలుసుకోవచ్చు. ధరణి పోర్టల్ చాలా బాగుంది.
– ఆచంట బాలకృష్ణ, రైతు, అశ్వారావుపేట
తెలంగాణ ప్రజల అదృష్టం
భూ సమస్యల పరిష్కా రం కోసం ఏర్పాటు చేసిన ధరణి ఓ అద్భు తం. ఇది తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వరం. ఏ రాష్ట్రంలో లేనటువంటి ఈ ప్రక్రియ ద్వారా ధరణి పోర్టల్‌లో చూసుకుంటే భూమి స్థితిగతులు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. దీనివల్ల మోసం, ట్యాంపరింగ్ జరుగకుండా ఉంటుంది. నిన్న స్లాట్ బుక్ చేసి పోస్టు చేయడంతో నేరుగా విజయవాడ నుంచి పెనుబల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నా. నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ కావడం చాలా సం తోషంగా ఉంది. రైతుల పట్ల కేసీఆర్‌కు ఉన్న విజన్ చాలా గొప్పది.
– షేక్ దలియాహుస్సేన్, విక్రయదారుడు, విజయవాడ
ఒక్కరోజుల్లోనే రిజిస్ట్రేషన్..
నేను వ్యవసాయ భూమి కొన్నాను. రిజిస్ట్రేషన్ ఒక్కరోజుల్లోనే అయ్యిపోయింది. భూ హక్కులు నా పేరున బదిలీ అయ్యాయి. తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చాలా సులభంగా అయ్యింది. గతంలో సబ్ రిజిస్టర్ కార్యాలయానికి పరుగులు తీయాల్సి వచ్చేది. రోజంతా పడిగాపులు. ఇప్పుడు ఒక్కరోజులోనే రికార్డులన్ని బదిలీ అవుతున్నాయి. ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు.
– బానోతు రాములు నాయక్, రైతు, అన్నపురెడ్డిపల్లి
సులభంగా భూ హక్కులు బదిలీ
వారసత్వ భూ హక్కుల కోసం గతంలో చాలా ఇబ్బందులు పడ్డాము. రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకున్నారు. ధరణి పోర్టర్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే భూ హక్కులు బదిలీకావడంతోపాటు పట్టా పాసు పుస్తకం ఇంటికే వచ్చింది. ధరణి పోర్టల్‌లో రైతులకు పారదర్శకంగా మెరుగైన సేవలు అందుతున్నాయి. మోసాలు, అక్రమాలు తగ్గాయి. రైతు అనుమతి లేనిదే ఇంచుభూమి కూడా మార్పిడి జరిగే అవకాశం లేదు.
– గాద లింగయ్య, రైతు, చండ్రుగొండ
రిజిస్ట్రేషన్ పారదర్శకంగా ఉంది
రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా పారదర్శకంగా, అత్యంత సులభంగా ఉంది. మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ అయ్యింది. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిగూడెం. ధరణి పోర్టర్ రైతులు, భూముల రికార్డుల నిర్వాహణకు భద్రత కల్పిస్తున్నది. అక్రమాలకు ఎటువంటి తావులేకుండా రిజిస్ట్రేషన్ జరిగింది. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులు తప్పాయి.
– ఆలపాటి సత్యనారాయణ, రైతు, ఆంధప్రదేశ్ రాష్ట్రం
హ్యాట్సాప్ సీఎం కేసీఆర్
గతంలో భూమి కొనుగోలు చేయాలంటే పాస్‌పుస్తకాన్ని పరిశీలించి అసలిదా లేదా నకిలీదా తెలుసుకొని సాక్షులను విచారించి సత్తుపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రోజులకొద్ది ఎదురు చూసి సంతకాలు పెట్టి ఆ రిజిస్ట్రేషన్‌ను ఎవరూ అడ్డుపడకుండా ఉండాలంటే 90రోజులు ఆగాల్సి వచ్చేది. కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు. కార్యాలయానికి వచ్చిన గంటలోనే స్లాట్‌బుకింగ్ ధ్రువపత్రాలు అందిస్తే చకచకా ఆన్లైన్లో రికార్డులు పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయడంతో మ్యూటేషన్ కూడా అవుతున్నది. అందుకు సంబంధించిన నక్కళ్లను తహసీల్దార్ అందిస్తున్నారు. ఇది మన తెలంగాణలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సాధ్యమైంది.
– సంక్రాంతి నాగేశ్వరరావు, కొనుగోలుదారుడు, ఖమ్మం
‘ధరణి’తో పట్టా భద్రం..
బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర గ్రామంలో నాకు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తాతల కాలం నుంచి వస్తున్న భూమిని మా తండ్రి సోమయ్య సాగుచేశారు. ఆయన మరణానంతరం వారసత్వంగా నాకు వచ్చింది. అయితే అప్పట్లో భూమికి సంబంధించి పహాణీలు, రకం పేరుతో కాగితాల రూపంలోనే ఉండేవి. ఎక్కడైనా రుణం తెచ్చుకోవాలన్నా ఇబ్బందిగా ఉండేది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టారు. దీంతో మా తండ్రి పేరుతో ఉన్న భూమిని తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసిన వెంటనే నా పేరు మీదకు మార్చి పట్టా అందజేశారు. నాడు కాగితాల రూపంలో ఉన్న రకం, పహాణీలు పట్టా బుక్‌గా మారడంతోపాటు ఆన్లైన్లో రికార్డులు భద్రంగా ఉన్నాయి. రైతుబంధు కూడా వస్తుండడంతో బ్యాంకు వాళ్లు రుణం ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ఎందరికో రక్షణగా నిలుస్తున్నది.
– చేతుల పెద్దవీర్రాజు, రైతు, మోరంపల్లిబంజర, బూర్గంపహాడ్
ధరణి పోర్టల్ ఎక్స్లెంట్
భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ చాలా బాగుంది. దీనివల్ల అవకతవకలు లేకుండా, సమయం వృథా కాకుండా పనులు జరుగుతున్నాయి. కార్యాలయానికి ఇరువర్గాలు చేరుకున్న 5 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకేసారి కావడం, పట్టాదారు నుంచి కొనుగోలుదారుడికి 5 నిమిషాల్లో సర్వేనెంబర్ భూమి బదిలీ కావడం చాలా అద్భుతం. గతంలో పహణీ నక్కళ్లు రాయడం వల్ల ఎక్కువ ఇబ్బందులు ఏర్పడేవి. ప్రతిరోజూ ఒకే సర్వేనెంబర్, ఒకే భూమి నాదంటే నాదంటి అనే వాదనలతోనే సరిపోయేది. కానీ నేడు అలాంటి సమస్యలన్నింటికీ ‘ధరణి’ చెక్ పెడుతున్నది
– ఎం.రమాదేవి, తహసీల్దార్, పెనుబల్లి
రిజిస్ట్రేషన్ చాలా సులభం
రిజిస్ట్రేషన్ చాలా సులభంగా ఉంది. ధరణి రాకముందు జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తిరగాల్సి వచ్చేది. కనీసం రెండు రోజులు కేటాయించి వ్యయప్రాయాసలు పడేవాళ్లం. ఇప్పుడు మండల కేంద్రంలోనే రిజిస్ట్రేషన్ చేసే సేవలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. మా నాన్న గారు మరణిస్తే వ్యవసాయ భూమిని వారసత్వం పొందాను. ఈ ప్రక్రియ ఒక్కరోజుల్లోనే పూర్తి అయ్యింది.
– ఉప్పల శశిదేవీ, అశ్వారావుపేట