ఖమ్మంరూరల్, ఏప్రిల్ 6 : మండల పరిధిలోని జిల్లా జైలును ఆదివారం డైరెక్టర్ ఆఫ్ జనరల్ ప్రిజన్స్, కరక్షనల్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ సౌమ్యమిశ్రా సందర్శించారు. ఖైదీలతో ముఖాముఖి ముచ్చటించారు. ఖైదీల బాగోగులను విచారించి వారికి జైలులో అందాల్సిన సదుపాయాలు అహారం, వైద్యం, న్యాయ సహాయం గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు కేటాయించిన లైబ్రరీని సందర్శించారు.
ముద్దాయిలకు సంబంధించిన కిచెన్, వైద్యశాలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. జైలులో ఉన్న స్టీల్, ఫినాయిల్ ఫ్యాక్టరీలను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించారు. ఉత్పత్తులను పెంచడానికి సిబ్బందికి అవసరమైన సూచనలిచ్చారు. ఖైదీల మనోవికాసం, వారి ఆరోగ్యం రిత్యా జైళ్లశాఖ చేపట్టిన స్పోర్ట్స్మీట్ గురించి వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ యం.సంపత్, జైలు పర్యవేక్షకుడు ఏ.శ్రీధర్ పాల్గొన్నారు.