ఆషాఢ మాసం షురువైంది.. గ్రామాలు బోనమెత్తుకునే వేళయింది. ఈ మాసంలో మహిళలు భక్తిశ్రద్ధలతో కొత్త బోనం కుండలో నైవేద్యం వండి ఇంట్లో పూజలు, దీపారాధన చేస్తారు. తర్వాత గ్రామదేవతలకు బోనం సమర్పించేందుకు వెళ్లడం ఆనవాయితీ. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగ జరిగింది. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడే విధంగా గ్రామస్తులు పూజలు నిర్వహించారు. మేళతాళాలు, శివసత్తుల పూనకాల నడుమ అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. నిష్ఠతో పూజ చేసి పంటలు బాగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, తమ కుటుంబాలను చల్లగా చూడాలని ‘తల్లీ నీకు బోనమో’ అంటూ మొక్కులు చెల్లించారు.
– నమస్తే నెట్వర్క్
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగను మహిళలు ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఉదయమే ఇళ్లను శుభ్రం చేసుకుని నూతన వస్ర్తాలు ధరించి కొత్త బోనం కుండలో అమ్మవారికి నైవేద్యం వండి ఇంటిల్లిపాదీ పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, శివసత్తుల పూనకాల నడుమ మహిళలు బోనాలు ఎత్తుకుని అలంకరించిన గ్రామ దేవతల ఆలయాలకు సమర్పించేందుకు బయలుదేరారు. బోనం కుండలోని నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి భక్తిశ్రద్ధలతో ధూప దీపారాధన చేశారు. చల్లంగ చూడు తల్లీ అంటూ మొక్కులు చెల్లించుకున్నారు.