భద్రాచలం, నవంబర్ 9: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీకమాసం కావడం, వరుస సెలవు దినాలు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో భద్రాద్రికి తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచి రామాలయంలోని క్యూలైన్లన్నీ కిక్కిరిశాయి. ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం, శీఘ్రదర్శనానికి గంట సమయం పట్టింది. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని దేవస్థానం అధికారులు ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. వెయ్యి మంది భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించారు.
ఆర్జిత సేవలో భాగంగా శ్రీ సీతారామచంస్రస్వామి వారికి అంతరాలయంలో ప్రత్యేక అభిషేకం చేశారు. స్వర్ణ పుష్పాలతో స్వామి వారికి సేవను నిర్వహించారు. కార్తీకమాసం సందర్భంగా దేవస్థానం అనుబంధ శివాలయంలో అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి వారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అలాగే, రామాలయంలో జరిపించిన శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణాన్ని వీక్షించేందుకు కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.