వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్నదని, మూడో సారి విజయం సాధించి కేసీఆరే సీఎం అవుతారని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్నదని, తెలంగాణ పథకాలను దేశం యావత్తు కోరుకుంటుందని, దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. సీఎం ఆశీస్సులతో కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగం అన్నారు.
కొత్తగూడెం అర్బన్, మే 21: సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని రామటాకీస్ ఏరియాలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ సహాయ సహకారాలతో నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నియోజకవర్గంపై ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో గ్రామగ్రామానికి రహదారులు నిర్మించామన్నారు. ప్రధాన రహదారుల మధ్య డివైడర్లు నిర్మించామన్నారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించామన్నారు. సీఎం విజన్‌తో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఏదో ఒక ప్రభుత్వ పథకం అందిందన్నారు.
ఆసరా, కల్యాణలక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధినే చాటి చెప్తున్నదన్నారు. చేయని పని ఎప్పటికీ చెప్పదన్నారు. ప్రతిపక్షాలు ఎన్నికుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు. సమావేశంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు కనుకుంట్ల పార్వతి, నాయకులు అఫ్జలున్నీషా బేగం, ధర్మరాజు, ప్రసాద్, దుంపల అనురాధ, శ్రీనివాస్, వాసు, వెంకట్, రజాక్, పిల్లి కుమార్, సంధ్య పాల్గొన్నారు.