మధిర, ఫిబ్రవరి 20: ఆక్రమణకు గురైన తన ఇంటి స్థలాన్ని ఇప్పించండి సారూ.. అంటూ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించింది. లేదంటే చావడానికైనా అనుమతి ఇవ్వండి అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుని మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం నిరసన దీక్ష చేపట్టింది.
ఈ సందర్భంగా దెందుకూరు గ్రామానికి చెందిన బాధితురాలు కనకపుడి కరుణమ్మ మాట్లాడుతూ గ్రామంలోని తన ఇంటి స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని, దీని గురించి తహసీల్దార్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కాలేదని వాపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలు స్థల వివాదంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించడం వల్లే తన సమస్య పరిష్కారం కావడం లేదని ఆరోపించింది. సమస్యను అధికారులు పరిష్కరిస్తారనే ఆశతో ఇన్నిరోజులు ఎదురుచూశానని, ఇక పరిష్కారం కాకపోవడంతో దీక్ష చేపట్టినట్లు విలపిస్తూ చెప్పింది.
కరుణమ్మ ఇంటి స్థలాన్ని ఆక్రమించిన వారికి నోటీసులు ఇచ్చాం. శనివారంలోపు ఆ స్థలానికి సంబంధించిన కాగితాలు తీసుకురావాలని ఆదేశించాం. వాటిని పరిశీలించిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటాం. దీనిపై ఆమె చేసిన ఆరోపణలు వాస్తవం కాదు. సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం.
-రాంబాబు, తహసీల్దార్, మధిర