మామిళ్లగూడెం, అక్టోబర్ 27: రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో టీస్టాల్, లేడీస్ లాంజ్, ఉద్యోగుల భోజనశాల, ఇందిరా మహిళాశక్తి క్యాంటిన్, బస్టాప్‌లను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తామని, వారు తీసుకున్న రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని తెలిపారు. ఏటా స్వయం సహాయక సంఘాలకు రూ.20 వేల కోట్లను వడ్డీలేని రుణాలుగా అందిస్తామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆర్టీసీకి అవసరమైన అద్దె బస్సుల సరఫరాను ఇక నుంచి మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ మాట్లాడుతూ.. మహిళాశక్తి క్యాంటీన్ ఏర్పాటు వల్ల ఇక్కడ 14 మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. జిల్లాలో గుర్తించిన ప్రాంతాల్లో క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళల అభివృద్ధి సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సుబ్బారావు, శిక్షణ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, డీఆర్డీవో సన్యాసయ్య, డీఆర్వో రాజేశ్వరి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుహాసిని, జిల్లా అధికారులు పాల్గొన్నారు.