ఖమ్మం, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణకు చెందిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ వద్ద కిషన్‌రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుంటే రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వెళ్లి ప్రధానిని కలిసి సింగరేణి బొగ్గు గనులు వేలం వేయొద్దని కోరతామని అన్నారు. వాటిని బహిరంగ వేలం వేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, రాగమయి, రాందాస్‌నాయక్, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌లతో కలిసి ఖమ్మం కలెక్టరేట్లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుందని అన్నారు. సింగరేణి కార్మికుల భవిత ఆధారపడి ఉన్నందున బొగ్గు గనులను వేలం వేయవద్దని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంగా ఉన్న సింగరేణి సంస్థకే ఆ గనులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి సమస్యను వివరిస్తామని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను వదులుకోబోమని అన్నారు. సింగరేణికి గనులు కేటాయించేందుకు ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసే విషయంలో అఖిలపక్షంతో బీఆర్ఎస్ కూడా కలిసి రావాలని సూచించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సింగరేణి దివాలా తీయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ మీద ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.