ఎర్రుపాలెం, అక్టోబర్ 13: రానున్న రోజుల్లో ఇందిరా మహిళా డెయిరీ విజయవంతమై దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎర్రుపాలెం మండలం కేంద్రంలో పాలశీతలీకరణ కేంద్రం, ఇందిరా మహిళా డెయిరీ యూనిట్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ.. ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటుతో నియోజకవర్గంలోని స్వయం సహాయ సంఘాల మహిళా సభ్యులను వ్యాపారవేత్తలుగా తయారు చేయబోతున్నామని అన్నారు.
మహిళలతో కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి ఇందిరా మహిళా డెయిరీను చాలా పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. పాల ఉత్పతి, సేకరణ, విక్రయాల ద్వారా వచ్చే ప్రతి పైసా మహిళా సభ్యులకే చెందే విధంగా ప్రాజెక్టులు రూపకల్పన చేశామని వివరించారు. నియోజకవర్గంలో ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు ప్రభుత్వం రెండు గేదెలను పంపిణీ చేస్తుందన్నారు. 2010లో ఈ ప్రాజెక్టు గురించి ఆలోచన చేశానని, 2011-12 సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రజల ముందుకు తీసుకొచ్చానని అన్నారు. సమాజాన్ని గొప్పగా నడిపించే విధంగా మహిళలు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.