విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉమ్మడి ఖమ్మం జిలాల్లో పరిపాలనా అధికారుల పోస్టులపై నీలినీడలు కమ్ముకోనున్నాయి. రెండు జిల్లాల విద్యాశాఖాధికారులు ఈ నెల ఆఖరికి ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ పోస్టుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఈ అధికారులు రెగ్యులర్ డీఈవోలు కూడా కాదు. పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారే. ఖమ్మం డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న సామినేని సత్యనారాయణ ఖమ్మం ఇన్చార్జి డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం డీఈవో ఆఫీసు ఏడీ వెంకటేశ్వరచారి భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి రిటైర్మెంట్ కారణంగా విద్యాశాఖలో ఎంతో కీలకమైన రెండు డీఈవో పోస్టులు, ఒక డైట్ ప్రిన్సిపాల్ పోస్టు, ఒక ఏడీ పోస్టు కలిపి మొత్తం నాలుగు పోస్టులు ఈ నెలాఖరుకు ఖాళీ అవుతున్నాయి. గత రెండేళ్లుగా రెగ్యులర్ జిల్లా విద్యాశాఖ అధికారులను నియమించకుండా విద్యాశాఖను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం.. ఈ సారైనా విద్యాశాఖకు రెగ్యులర్ డీఈవోలను నియమిస్తుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
-ఖమ్మం, జూలై 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించడంలో కీలకంగా ఉండే డైట్ కళాశాల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారబోతోంది. ఖమ్మం నగరంలోని డైట్ కళాశాలలో గత మూడు నెలల వరకు రెగ్యులర్ అధ్యాపకులు ఇద్దరు ఉండగా.. వారిలో ఒకరు సోమశేఖర శర్మ, మరొకరు సామినేని సత్యనారాయణ. మిగిలిన అధ్యాపకులు లెక్చరర్ సమాంతర పోస్టులను కలిగి ఉన్నారు తప్ప లెక్చరర్ క్యాడర్ పరిధిలోకి రారు. డైట్ లెక్చరర్‌గా ఉంటూ ఖమ్మం డీఈవోగా పనిచేసిన సోమశేఖర శర్మ గత ఏప్రిల్‌లో ఉద్యోగ విరమణ చేశారు. దీంతో డైట్ ప్రిన్సిపాల్‌గా ఉన్న సామినేని సత్యనారాయణకు ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎంతో కీలకమైన ఈ రెండు పోస్టులు కష్టమైనప్పటికీ ఆయన ఇన్నాళ్లూ నెట్టుకొచ్చారు. ఇప్పుడు ఆయన కూడా ఈ నెల చివరలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో డైట్ ప్రిన్సిపాల్‌గా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించేందుకు కూడా ఎవరూ లేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో దాదాపు చాలా చోట్ల డైట్ లెక్చరర్లకే డీఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించిన తరుణంలో ఖమ్మం డైట్ కళాశాలలో రెగ్యులర్ లెక్చరర్లు ఎవరూ లేకపోవడంతో రెగ్యులర్ లెక్చరర్గానీ, ప్రిన్సిపాల్‌గానీ ఎవ్వరినీ నియమించే అవకాశం కూడా లేదని విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు.
రెగ్యులర్ డీఈవోలు లేని కారణంగా ఖమ్మం, భద్రాద్రి డీఈవో పోస్టులు రెండేళ్లుగా ఇన్చార్జుల పాలనలోనే నడుస్తున్నాయి. అప్పట్లో ఖమ్మం డీఈవోగా పనిచేసిన యాదయ్య సెలవుపై వెళ్లడంతో అప్పటి భద్రాద్రి డీఈవోగా పనిచేస్తున్న సోమశేఖర శర్మను ఖమ్మం డీఈవోగా నియమించారు. భద్రాద్రి డీఈవోగా అప్పుడు హైదరాబాద్ డీఎస్సీలో పనిచేస్తున్న డిప్యూటీ డైరెక్టర్‌ను నియమిస్తే బాధ్యతలు స్వీకరించలేదు. తర్వాత మరొకరిని నియమిస్తే కొన్ని నెలలు మాత్రమే పనిచేశారు. ఆ తర్వాత ఖమ్మం డీఈవో కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎం.వెంకటేశ్వరచారిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారిగా నియమించారు.
ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించిన సమయంలోనే నూతన డీఎస్సీ, బదిలీలు, శిక్షణలు తదితర ప్రక్రియలు వెనువెంటనే వచ్చాయి. వాటిల్లో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. గత మూడు నెలల నుంచి ఉపాధ్యాయుల శిక్షణలు, సర్దుబాట్లు, ఉద్యోగోన్నతుల వంటి ప్రక్రియలతో విసుగుచెందిన ఖమ్మం డీఈవో సామినేని సత్యనారాయణ, భద్రాద్రి కొత్తగూడెం డీఈవో వెంకటేశ్వరచారిలు ఇటీవల ఒకానొక దశలో తాము ఈ విధులు నిర్వర్తించలేమంటూ ఉన్నతాధికారులకు విన్నవించారు. ఈ క్రమంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. వీరి రిటైర్మెంట్ల గడువూ సమీపించింది. ఈ నేపథ్యంలో ఎంతో కీలకమైన నాలుగు పోస్టులు ఖాళీ అవుతుండడంతో విద్యా సంవత్సరం ఎలా ముందుకు సాగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.