తాము అధికారంలోకి రాగానే నిర్వాసితులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటూ అప్పుడు మాజీ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ.. ఆయన మంత్రి అయ్యాక కూడా నీటిమూటగానే మిగిలిపోయింది. గనుల విస్తరణ కోసం ఓ వైపు సింగరేణి అధికారులు క్వార్టర్లు కూల్చుతూ ముందుకెళ్తుంటే.. మాట ఇచ్చిన అమాత్యుడు మాత్రం అటువైపు చూసిన పాపాన పోవడం లేదు. దీంతో ఓ వైపు గూడు లేక, మరో వైపు మాట ఇచ్చిన మంత్రి నుంచి ఇందిరమ్మ ఇల్లు రాక, ఇంకోవైపు గత ప్రభుత్వం ఇచ్చిన జాగాల్లో ఇళ్లు నిర్మించుకునే స్తోమత లేక.. ఆ నిర్వాసితులు పడుతున్న ఆవేదనకు అంతులేకుండా పోయింది.
రామవరం, నవంబర్ 3: వారు తమ తాతలు, తండ్రుల తరాల నుంచి ఇక్కడి బొగ్గుబావుల్లో పనిచేసే కార్మికులు. ఆనాటి నుంచీ సింగరేణి ఎస్ఆర్టీ ప్రాంతంలోని క్వార్టర్లలో నివాసం ఉంటున్నారు. రెండు మూడు తరాలుగా ఇక్కడే జీవిస్తుండడంతో వారి కుమారులు, కుమార్తెలు, ఆ తరువాత వారి పిల్లలు కుటుంబాలుగా ఏర్పడ్డారు. వారు కూడా అదే క్వార్టర్ల సమీపంలో సింగరేణి స్థలంలో సొంతంగా ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. అయితే, రుద్రంపూర్ ఏరియా వెంకటేశ్ ఖని విస్తరణలో భాగంగా సింగరేణి మాజీ కార్మికులు, వారి వారసులు నివసించే ఈ క్వార్టర్లను సంస్థ కూల్చి వేసింది.
వారంతా ఏడాది క్రితం నిర్వాసితులయ్యారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్వాసితులకు గత ఎమ్మెల్యే వనమా ఆధ్వర్యంలో ఇంటి స్థలాలు ఇచ్చింది. ఆ తరువాత సర్కారు మారిపోయింది. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. అదే.. ఆ నిర్వాసితుల పాలిట శాపమైంది. వారి ఇళ్లు కాదు కదా.. కనీసం జాగా ముచ్చట గురించి పట్టించుకునే వారు కూడా కరువయ్యారు. ఎంతమందికి చెప్పినా, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారి వైపు చూసిన పాలకులు, అధికారులు లేరంటే అతిశయోక్తి కాదు.
ఏడాది క్రితం సింగరేణి అధికారులు ఎస్ఆర్టీ నిర్వాసితులను ఖాళీ చేయించారు. వారికి కొత్తగూడెం మ్యాైగ్జెన్ ప్రాంతంలో వంద గజాల చొప్పున స్థలాన్ని ఇచ్చారు. అయితే, ‘ఇప్పటికిప్పుడు ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే కనీసం రూ.5 లక్షలైనా కావాలి. ఇల్లు విప్పితే రేకులు తప్ప ఏమీ వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం తరఫున మమ్మల్ని ఆదుకునే వారు కనపడడం లేదు.’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎస్ఆర్టీ నిర్వాసితులు. ఒకవైపు అధికారుల ఒత్తిడి పెరుగుతుండడం, మరోవైపు ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన హామీ రాకపోవడం వంటి కారణాలతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నిర్వాసితులకు అప్పటి కేసీఆర్ సర్కారు అండగా నిలిచి ఇంటి జాగను ఇచ్చింది. సర్వే నంబర్ 143లో ఒక్కొక్కరికి వంద గజాల చొప్పున 286 మందికి గత ఏడాది అక్టోబర్ 3న అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఈ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వీరిలో మాయాబజార్ నుంచి 83 మంది, వనమా నగర్ నుంచి 61 మంది, ఎస్ఆర్టీ క్వార్టర్లలో ఉంటున్న 83 మంది, అదే ఎస్ఆర్టీ ఏరియాలో సొంతంగా నిర్మించుకున్న 59 మంది ఉన్నారు.
ఎస్ఆర్టీ ప్రాంతంలో మొత్తం 154 క్వార్టర్లుండగా అందులోని 83 మందిని, సొంతంగా ఇల్లు నిర్మించుకున్న 65 మందిలో 59 మందిని మాత్రమే అప్పటి సింగరేణి అధికారులు లబ్ధిదారులుగా పరిగణించారు. వీరిలో కొందరు అర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోవడంతో వారంతా అప్పటి ఎమ్మెల్యే వనమాను ఆశ్రయించారు. అర్హుల గుర్తింపునకు ఆయన మరోసారి సర్వేకు ఆదేశించినప్పటికీ తరువాత ఎన్నికల కోడ్ రావడంతో అది ఆగిపోయింది. దీంతో నిజమైన అర్హులకు పట్టాలు అందలేదు. గతంలో వెంకటేశ్ ఖని ప్రాంతాన్ని ఖాళీ చేయించిన సందర్భంగా అక్కడ పట్టాలు తీసుకున్న లబ్ధిదారులు ఎస్ఆర్టీ ఏరియాలో కూడా పట్టాలు తీసుకున్నారని, దీనివల్ల తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఇప్పటికే కలెక్టర్కు విన్నవించారు.
లబ్ధిదారుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందంటూ గత ఏడాది అక్టోబర్ 2న మాయాబజార్, రుద్రంపూర్ ప్రాంతాల్లో యువకులు సెల్ఫోన్ టవర్లు ఎక్కారు. ఆ సమయంలో అప్పటి మాజీ ఎంపీ, ప్రస్తుత మ్రంతి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడి చేరుకున్నారు. అధైర్య పడొద్దని, తమ ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ పట్టాలు ఇప్పిస్తామని, డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం అక్కడి నిర్వాసితులు నిరాశ్రయులైనా పొంగులేటి మాట నీటి మూటగానే మిగిలిపోయింది.
సర్వే సమయంలో మా ఆయనకు పక్షవాతం రావడం వల్ల మేం ఆస్పత్రిలో ఉన్నాం. ఆ తర్వాత మేం అధికారులను కలిసి పత్రాలన్నీ ఇచ్చాం. కానీ మాకు పట్టా రాలేదు. మాలాగా సొంతగా ఇంటిని నిర్మించుకొని ఉంటున్న ఇంకొంత మందిది కూడా ఇదే పరిస్థితి. అర్హులు కాని వారందరూ అర్హులయ్యారు. అర్హులైన మేము అనర్హులయ్యాం.
-మిట్టపల్లి కల్యాణి, ఎస్ఆర్టీ ఏరియా
నేను సింగరేణిలో 36 ఏళ్లు పనిచేశా. అప్పటి మా కార్మికుల ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఇంటి ముందు ఖాళీ జాగా ఉంటే తుమ్మలు మొలిచిన ప్రాంతంలో శుభ్రం చేసుకొని సొంతగా ఇంటిని కట్టుకున్నాం. ఇప్పుడు అధికారులు వచ్చి మరో చోట పట్టా ఇచ్చారు. ఇక్కడ వెంటనే ఖాళీ చేయాలంటున్నారు. ఇప్పుడున్న నా ఆర్థిక స్తోమతతో కొత్తగా ఇల్లు నిర్మించుకోలేను. ప్రభుత్వమే మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి.
-బొజ్జం రాయమల్లు, రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి
ఇల్లు లేని వారికి ఇల్లు కట్టిస్తానంటున్న ప్రభుత్వం.. ఇల్లులు కూల్చి వేసిన మాకు ఇల్లు కట్టియ్యదా? మేము ఇక్కడ 24 ఏళ్లుగా ఉంటున్నాం. మా తండ్రి కూడా సింగరేణిలో పనిచేశాడు. సింగరేణి క్వార్టర్లలో అక్రమంగా ఉన్నవారికి అదే వంద గజాలు ఇచ్చారు. కష్టంతో మేం నిర్మించుకున్న ఇంటికి కూడా అదే వంద గజాలు ఇచ్చారు. కనీసం నష్ట పరిహారం కూడా ఇవ్వకుండా కూల్చడంతోనే 39 మందిమి కోర్టును ఆశ్రయించాం.
-మాదిరి శంకర్, ఎస్ఆర్టీ ఏరియా
వంద గజాల ఇంటి స్థలం ఇచ్చామని చెప్పి సింగరేణి అధికారులు మా ఇల్లు కూల్చువేశారు. వంద గజాల్లో ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి? కార్కానా ఎక్కడ పెట్టుకోవాలి? ఉన్నపళంగా ఖాళీ చేయాలంటున్నారు. ఈ గొడవల వల్ల కొన్ని రోజులుగా పనిలేక పస్తులు ఉండాల్సి వస్తోంది. ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే స్తోమత లేదు. ప్రభుత్వమే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలి.
-మందా నాగేశ్వరరావు, కార్పెంటర్, ఎస్ఆర్టీ ఏరియా
వెంకటేశ్ ఖని ఓసీ విస్తరణలో భాగంగా ఎస్ఆర్టీ ఏరియా, మాయాబజార్, వనమా నగర్లలో ఉంటున్న నిర్వాసితుల కోసం ఎకరానికి 2.32 కోట్లు వెచ్చించి 15 ఎకరాలను సేకరించాం. సర్వే నెంబర్ 143లో ఒక్కొక్కరికి వంద గజాల చొప్పున 345 మందికి స్థలాలను ఇచ్చాం. అక్కడ రోడ్లు, డ్రెయిన్లు, బోర్లు, కరెంటు వంటి సౌకర్యాలను కల్పించాం. ఎస్ఆర్టీ ఏరియా నుంచి మాైగ్జెన్ ఏరియాకు సామాగ్రిని తరలించుకునేందుకు వాహనాలను అందుబాటులో ఉంచాం. ఇంకా ఏమైనా అవసరమైతే తెలియజేయాలి.
-శ్రీరమేశ్, పీవో, వెంకటేశ్ ఖని