ఖమ్మం రూరల్, మార్చి 27: మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఎన్నికల హామీలో భాగంగా అర్హులైన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ రూరల్ మండలం కస్నాతండాకు చెందిన రైతు భూక్యా నాగేశ్వరరావు అర్ధనగ్నంగా, మెడలో మిర్చి దండ, చేతిలో ప్లకార్డుతో తన మిర్చి కల్లంలో గురువారం గంటపాటు నిరసన చేపట్టాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఖమ్మంలోని ఓ బ్యాంకులో రూ.2.25 లక్షల పంట రుణం తీసుకున్నట్లు తెలిపాడు. బ్యాంకు అధికారులు ఒత్తిడి చేయడంతో బయట ఫైనాన్స్‌కు తెచ్చి రూ.2.20 లక్షల అసలుతోపాటు వడ్డీ రూ.50 వేలు కలిపి.. మొత్తం రూ.2.70 లక్షల బాకీ తీర్చినట్లు చెప్పాడు.
అయినప్పటికీ తనకు రుణమాఫీ డబ్బులు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాక నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేశానని, ఆశించిన దిగుబడి రాకపోవడంతోపాటు మార్కెట్లో ధర గణనీయంగా తగ్గిందని వాపోయాడు. ప్రభుత్వం వెంటనే ఈ రెండు అంశాలపై దృష్టి సారించి తనకు న్యాయం చేయాలని కోరుతూ నిరసనకు దిగినట్లు నాగేశ్వరరావు పేర్కొన్నాడు.