మధిర, మే 21 : పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీ 108 అంబులెన్స్‌లో ప్రసవించింది. ఈ ఘటన మధిర మండలంలో బుధవారం జరిగింది. మధిర మండలం మహాదేవాపురం గ్రామానికి చెందిన పి.స్రవంతికి బుధవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో హుటాహుటిన మధిర ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన డాక్టర్ ఖమ్మం వెళ్లాల్సిందిగా సూచించి 108 అంబులెన్స్‌కి కాల్ చేసి ఖమ్మంకి పంపించారు. 108 వాహనంలో ఖమ్మం వెళ్తుండగా బోనకల్లు దగ్గరలో నొప్పులు అధికమవడంతో ఈఎంటీ రామయ్య, పైలట్ మణికుమార్, ఆశ వర్కర్ సహాయంతో డెలివరీ చేయగా స్రవంతి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ప్రసవం అనంతరం స్రవంతిని మధిర ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు.