ఖమ్మం సిటీ, మే 19: ‘తెలంగాణలో రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనేది రాష్ట్రంలోని సబ్బండవర్గాల నినాదంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని 44వ డివిజన్లో విస్తృతంగా పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని పదవుల్లో ఊరేగుతున్న మంత్రులపై విరుచుకుపడ్డారు. నలభై ఏండ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ తిరగడంకాదని, ఖమ్మం ప్రజలకు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలో చిరు వ్యాపారాలు చేసుకుని బతికే పేదలను కాంగ్రెస్ నేతలు అనేక ఇబ్బందులకు గురిచేశారని, వారందరికీ బుద్ధి చెప్పేందుకు పేదలు సిద్ధంగా ఉన్నారన్నారు.
వెలుగుమట్లలో ఇండ్లను కూల్చి ఆ భూములను కబ్జాదారులకు అప్పగించాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ నిరుపేదలకు అండగా నిలిచిందన్నారు. కాంగ్రెస్సోళ్లకు అధికారం వచ్చింది కానీ ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పులేదని అన్నారు. మరో రెండున్నరేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టంచేశారు. ‘మందికి పుట్టిన బిడ్డను.. మా బిడ్డ’ అని ఎగరేసి ముద్దాడిన చందంగా ఖమ్మంలో కాంగ్రెస్ నేతల తీరు ఉందని పువ్వాడ అజయ్ మండిపడ్డారు. అరవై డివిజన్లలో రాజకీయాలకు అతీతంగా ఖమ్మం నగరాన్ని దగ్గరుండి అభివృద్ధి చేశామన్నారు.

Khammam1
రెండున్నరేండ్లలో నయాపైసా నిధులు తీసుకురాని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ అభివృద్ధిని తమదిగా బ్యానర్లు, ఫ్లెక్సీలు వేసి ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. డివిజన్లోని పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మొహమూద్, మొయిన్, జానీ, సాయి, అజాస్, సోహైల్, జావీద్ తదితరులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. వారికి మాజీ మంత్రి పువ్వాడ గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, ఎండీ తాజుద్దీన్, మక్బుల్, బచ్చు విజయ్‌కుమార్, బత్తుల మురళి, శీలంశెట్టి వీరభద్రం, బుర్రి వెంకటేశ్వర్లు, బుర్రి వినయ్, బుడిగెం శ్రీను, పాలడుగు పాపారావు, గొల్లపూడి రాంప్రసాద్, మాటేటి కిరణ్, మోరంపూడి సాయి, షకీనా, ఖదీర్, మోహన్‌రావు, షకీల్, గౌరీనాథ్, వీరేందర్ తదితరులు పాల్గొన్నారు.