ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు, ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఖమ్మం జిల్లా ప్రజలు మరోసారి జేజేలు పలికారు. ‘దీక్షా దివస్’ సందర్భంగా శుక్రవారం ఖమ్మం నగరం గులాబీమయమైంది. మాజీ మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు గొంతెత్తి జై తెలంగాణ, జై జై కేసీఆర్ అంటూ నినాదాలు చేయడం నాటి ఉద్యమాన్ని మరోసారి గుర్తుకుతెచ్చింది. తెలంగాణ తల్లి, అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అన్నదానం నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో కేసీఆర్ భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి క్షీరాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు. నాడు ఖమ్మంలో జరిగిన దీక్షా దివస్, ఉద్యమ చిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
– ఖమ్మం, నవంబర్ 29