ఖమ్మం, నవంబర్ 29 : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ వేడుకలను నిర్వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఖమ్మంలో దీక్షా దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖమ్మం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం(తెలంగాణ భవన్)లో పెద్దఎత్తున సభ నిర్వహించారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి భారీసంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో ఖమ్మం నగరం గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, దీక్షా దివస్ ఖమ్మంజిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఖమ్మంలో పుట్టిన అగ్గి రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించిందని, కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ ద్వారా ఖమ్మంకు తెలంగాణ చరిత్ర పుటల్లో స్థానం దక్కిందన్నారు.
1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మంది ప్రజలు భాగస్వాములు అయ్యారని, ఉద్యమాన్ని నడిపించే నాయకుడు లేకపోవడం వల్ల లక్ష్యం నెరవేరలేదన్నారు. కానీ 2001లో చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కేసీఆర్‌ను అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని పలకనీయకుండా ఆనాటి సమైక్య పాలకులు అడ్డుకోవడంతో పౌరుషంతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించారని అన్నారు. నాటినుంచి 2014 వరకు ఉద్యమాన్ని నడిపి రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. 2009 నవంబర్ 29న కేసీఆర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు తెలంగాణవాదం తక్కువగా ఉంటుందని భావించి ఖమ్మం తీసుకొచ్చారని, కానీ ఖమ్మం ప్రజలు చూపించిన తెగువ, పోరాటస్ఫూర్తి తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందన్నారు.
దీక్షా దివస్ స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ చావు నోట్లో కేసీఆర్ తల పెట్టి తెలంగాణను సాధించారన్నారు. ఖమ్మం జైల్లో కేసీఆర్ ఉన్నప్పుడు తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు కేసీఆర్‌ను కలిశారని గుర్తుచేశారు. అనేకమంది కుట్రలు, కుతంత్రాలు చేసినా ఉద్యమాన్ని వెనుదిరగకుండా నడిపించి రాష్ర్టాన్ని సాధించిన మహోన్నత నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ 11నెలల కాలంలోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. కేసులు బీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టలేవని, గుండెలపై గులాబీజెండా ఉన్నంత వరకు ఎవరికీ భయపడమన్నారు.
వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టానికి పునాదిపడిన రోజు దీక్షా దివస్ అని అన్నారు. కేసీఆర్ తెలంగాణ కోసం అనేక అవమానాలు, అవహేళనలకు గురయ్యారని అన్నారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో కేసీఆర్ ఉద్యమస్ఫూర్తితో ముందుకుసాగాలని, ఉద్యమకారులకు ప్రతిఒక్కరం రుణపడి ఉన్నామన్నారు. కాంగ్రెస్ విధానాలను చూశాక ప్రజలు బీఆర్ఎస్ నాయకులకు మనోధైర్యం కల్పిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన 420 హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ను ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికీ అర్థంకావడం లేదన్నారు.
గతాన్ని మర్చిపోయి రానున్న రోజుల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని, భవిష్యత్ మనదే అన్నారు. జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ తెలంగాణ జైత్రయాత్రో లేక కేసీఆర్ శవయాత్రో అనే నినాదంతో దీక్షా దివస్‌ను చేపట్టిన కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించారని అన్నారు. తెలంగాణ కోసమే పార్టీని పెట్టి రాష్ర్టాన్ని సాధించి దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిపారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ఎమ్మెల్యేగా ఉండడం, ఆ ఉద్యమంలో పాలుపంచుకోవడం తన అదృష్టమన్నారు.
సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం ఒక చరిత్రాత్మక ఘట్టమన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారుడు బిచ్చాల తిరుమలరావు, బొమ్మెర రామ్మూర్తి, ఉప్పల వెంకటరమణ, డోకుపర్తి సుబ్బారావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రాష్ట్ర నాయకులు రాకేష్‌రెడ్డి, మాటేటి కిరణ్‌కుమార్, ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఖమర్, ఉమామహేశ్వరరావు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, మరికంటి ధనలక్ష్మి, బెల్లం వేణుగోపాల్, సతీష్, వీరూనాయక్, ఉన్నం బ్రహ్మయ్య, వీరన్న, బాణాల వెంకటేశ్వర్లు, కర్నాటి కృష్ణ, శేషు పాల్గొన్నారు.
ఖమ్మం తెలంగాణ భవన్ వద్ద ఏర్పాటు చేసిన కేసీఆర్ భారీ ఫ్లెక్సీకి బీఆర్ఎస్ నాయకులు క్షీరాభిషేకం, పుష్పాభిషేకం చేశారు. జై తెలంగాణ, జై జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణభవన్ దద్దరిల్లింది.
ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉదయం మమత ఆసుపత్రిలోని తన ఇంటి నుంచి బైక్ మీద ర్యాలీగా బయలుదేరి బైపాస్ రోడ్డుకు చేరుకుని తెలంగాణ తల్లికి నివాళి అర్పించి, ఆక్కడ నుంచి అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు.
దీక్షా దివస్ సందర్భంగా అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సభలో అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆ తరువాత కేసీఆర్ ఉద్యమ ఘట్టాలు, కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన 30 నిమిషాల వీడియోను సభికులు వీక్షించారు. కేసీఆర్ దీక్షా దివస్ ఫొటోలు, ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స, జైలుకు తరలింపు తదితర ఫొటో ఎగ్జిబిషన్‌ను పువ్వాడ అజయ్ ప్రారంభించారు.
ఖమ్మం నగరంలోని బైపాస్‌రోడ్‌లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలదండలు వేసి నివాళులర్పించారు. మయూరిసెంటర్‌లో గల తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని అమరవీరులకు నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అన్నదానం నిర్వహించారు.