ఖమ్మం, నవంబర్ 28: ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో..’ అనే నినాదంతో 2009 నవంబర్ 29న ఉద్యమసారథి, స్వరాష్ట్ర సాధకుడు కేసీఆర్ చేపట్టిన దీక్ష గురించి, దాని ప్రాముఖ్యత గురించి భావితరాలకు తెలియజేసేందుకు ఖమ్మంలో శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు తెలిపారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం పిలుపునిచ్చారు.
ఖమ్మంలోని తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటి కేసీఆర్ ఉద్యమ చరిత్రను, ఉద్యమంతో ఖమ్మానికి ఉన్న అనుబంధాన్ని దీక్షా దివస్ సందర్భంగా చాటి చెప్పేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా ఖమ్మంలోని ఎన్టీఆర్ సరిల్ వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేయనున్నట్లు తెలిపారు. పెవిలియన్ గ్రౌండ్ వద్దనున్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఘన నివాళులర్పించి జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాలన్నీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జరుగుతాయని తెలిపారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ ఫొటో ఎగ్జిబిషన్ ఉంటుందన్నారు.
అనంతరం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జిగా ఉన్న తన ఆధ్వర్యంలో ఆ జిల్లాలోనూ పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యకమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మలిదశ ఉద్యమానికి ఖమ్మం జిల్లానే ఊపిరి పోసిందని గుర్తుచేశారు.
15 ఏళ్ల క్రితం కేసీఆర్ చావు నోట్లో తల పెట్టిన కేసీఆర్.. శాంతియుత పద్ధతిలో తెలంగాణను సాధించారని జ్ఞప్తికి తెచ్చారు. అబద్ధాలతో ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల హామీల అమలులో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు బానోతు చంద్రావతి, బిచ్చాల తిరుమలరావు, బీరెడ్డి నాగచంద్రరెడ్డి, ఖమర్, బెల్లం వేణు, శీలంశెట్టి వీరభద్రం, తోట వీరభద్రం, తెలంగాణ ఉద్యమకారులు ఉప్పల వెంకటరమణ, బొమ్మెర రామ్మూర్తి, డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేందర్, సతీశ్, గొట్టెముకుల శీను, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.