సత్తుపల్లి, మే 8: ‘ఏడాదిలో కనీసం 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలి.. వలసలను నివారించాలి.. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని పారదోలాలి..’ అన్న సంకల్పంతో 2005లో నాటి ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది.. నాటి నుంచి అప్రతిహతంగా పథకం కొనసాగు తున్నది.. దేశవ్యాప్తంగా కోట్లాది మందికి కరువు కాలంలో ఉపాధి వనరుగా నిలిచింది. గతేడాది వరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కొనసాగిన పథకం ఇప్పుడు పూర్తిగా కేంద్రం పరిధిలోకి వెళ్లింది. అప్పటి నుంచి పనుల గుర్తింపు, కేటాయింపు, వేతనాల చెల్లింపుల్లో లేనిపోని ఆంక్షలు వచ్చాయి.. మరోవైపు కూలీలకు రోజువారీ వేతనం గరిష్ఠంగా రూ.272 అందించాల్సి ఉండగా ప్రస్తుతం రూ.200 అయినా ఇవ్వడం లేదు. పోనీయ్.. వచ్చే వేతనమన్నా వెంటనే అందుతుందా అంటే అదీ లేదు.. వేతన చెల్లింపులకు మూడు నెలల సమయం పడుతున్నది.. దీంతో ఇప్పుడు ఉపాధి పనులకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వస్తున్నది.. ఖమ్మం జిల్లాలోని 6.45 లక్షల మంది కూలీల్లో కేవలం 3.12 లక్షల మందే యాక్టివ్ కూలీలవ్వడమే అందుకు నిదర్శనం
గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి పేద వెనుబడిన వర్గాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2005లో నాటి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. జాబ్ కార్డు ఉన్న ప్రతి కూలికి ఏడాదిలో వంద రోజుల పాటు ఉపాధి కల్పించడం ఉపాధి అధికారుల బాధ్యత. గతేడాది వరకు కేంద్ర, రాష్ర్టాల భాగస్వామ్యంతో కొనసాగిన పథకం ఇప్పుడు కేంద్ర పరిధిలోకి వెళ్లింది. కేంద్ర ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తూ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు సకాలంలో అందడం లేదని, ఉపాధి కల్పనకు లేనిపోని కొర్రీలు పెడుతున్నదని ఆరోపిస్తున్నారు. పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని, వేసవిలో పని ప్రదేశం వద్ద టెంట్ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఏర్పాట్లు సక్రమంగా ఉండడం లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ప్రస్తుతం ఖమ్మం జిల్లా పరిధిలోని 589 గ్రామ పంచాయతీల పరిధిలో 6.45 లక్షల మంది కూలీలు ఉండగా 3.12 లక్షల మందైనా ఉపాధి పనులకు వెళ్లడం లేదు. అంటే.. ఈ చొప్పున సగానికి సగం మందైనా పనులకు హాజరుకావడం లేదు.
గతేడాది నుంచి కేంద్రం పరిధిలో…
ఉపాధి పథకం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నప్పటికీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వాలూ కొంత వాటా చెల్లించేవి. 2022 నుంచి పథకం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో కొనసాగుతున్నది. గతేడాది నుంచి వేసవి భత్యం పూర్తిగా నిలిపివేసింది. రకరకాల ఆంక్షలు పెట్టి కేంద్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదంటూ వాపోతున్నారు.
రూ.200 దాటని కూలీ…
రోజంతా కష్టపడ్డా రోజుకు రూ.200 కూలీ అయినా గిట్టుబాటు కావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంగా గరిష్ఠంగా రోజుకు రూ.272 కూలి నిర్ణయించగా ప్రస్తుతం రూ.200లోపే కూలీ గిట్టుబాటు అవుతున్నది. గతంలో ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 20 నుంచి 30శాతం వరకు కూలీలకు వేసవి భత్యం అదనంగా అందేది. ఫిబ్రవరిలో 20శాతంతో ప్రారంభమై మార్చిలో 25శాతం, ఏప్రిల్‌లో 30, మేలో 30, జూన్‌లో 20శాతం వేసవి భత్యాన్ని చెల్లించేది. గతేడాది వేసవి నుంచి కేంద్రం ప్రభుత్వం భత్యాన్ని తొలగించింది.
మూడు నెలలు దాటినా అందని కూలి..
గతంలో కూలీలు పని చేసిన తర్వాత వారం పది రోజుల్లోపు వేతనం చేతికి అందేది. కానీ ప్రస్తుతం రెండు, మూడు నెలలైనా కూలి అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనికి వినియోగిస్తున్న ఎన్ఐసీ సాఫ్ట్వేర్ సక్రమంగా పనిచేయకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కూలీలు హాజరు నమోదు ప్రక్రియ ప్రహసనంలా మారింది. ఉపాధి అధికారులు కూలీలకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు పని కేటాయించాల్సి ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా కూలీలు ఉదయం మాత్రమే పనికి వెళ్తున్నారు. మధ్యాహ్నం కూలికి వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువగా నమోదవుతున్నది.
తగ్గుతున్న కూలీల సంఖ్య…
కేంద్ర ప్రభుత్వం జాతీయ మొబైల్ పర్యవేక్షణ వ్యవస్థ(ఎన్ఎంఎంఎస్) కింద రోజువారీ కూలీల వివరాలు నమోదు చేయాలని నిర్ణయించింది. మరోవైపు కూలీ డబ్బు చెల్లింపు కోసం జాబ్‌కార్డు, ఆధార్, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయాలని కేంద్రం నిబంధన తీసుకువచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో చాలా మంది ఆధార్‌కార్డుల్లో తప్పులు దొర్లడం, బ్యాంకు ఖాతాలు లేకపోవడం వంటి కారణాలతో కూలీల వేతనాల చెల్లింపు ప్రక్రియ ఆలస్యమవుతుంది. కూలి గిట్టుబాటు కాకపోవడంతో క్రమక్రమంగా ఉపాధి పనికి వెళ్లే కూలీల సంఖ్య పూర్తిగా తగ్గింది.
కొలతల ప్రకారమే కూలీ..
కూలీలు చేసిన పనిని మేం కొలతలు వేస్తాం. ఆ మేరకు కూలీలకు కూలి గిట్టుబాటు అవుతుంది. పని ఎక్కువగా చేస్తే వేతనం వస్తుంది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పనిచేస్తే మెరుగైన వేతనం దొరుకుతుంది. ఏడాదిలో ప్రతి కుటుంబానికి 100 రోజుల పాటు పని కల్పిస్తాం.
– బాబూరావు, ఉపాధి పథకం ఏపీవో, సత్తుపల్లి
కూలీ గిట్టుబాటు కావడంలేదు..
నేను పదేళ్లుగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాను. గతంలో గ్రామాల్లో అంతగా పని దొరికేది కాదు. ఉపాధి పనికి వెళితే వారం వారం వేతనం అందేది. కూలి గిట్టుబాటు అయ్యేది. కానీ ప్రస్తుతం పని చేసిన తర్వాత మూడు నెలలైనా వేతనం అందడంలేదు. అది కూడా రోజుకు రూ.100 నుంచి రూ.150 మాత్రమే గిడుతుంది. దీంతో గత్యంతరం లేక వ్యవసాయ పనులకు వెళ్తున్నాను. అదీ గిట్టుబాటు కాక ఇంటి వద్ద చిన్న కిరాణా దుకాణం నడుపుతున్నాను.
– వల్లెపు లక్ష్మి, ఉపాధి కూలీ, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం
మూడు నెలలైనా వేతనం అందడం లేదు..
గతంలో భార్యాభర్తలిద్దరం ఉపాధి పనికి వెళ్లేవాళ్లం. అప్పుడు వారం వారం కూలి ఖాతాలో జమయ్యేది. ఇప్పుడు పని చేసిన మూడు నెలలు దాటినా వేతనం అందడం లేదు. ఇప్పుడు సీఎం కేసీఆర్ పుణ్యామా అని సాగునీటి వనరులు పెరిగాయి. భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నాయి. మేము ప్రస్తుతం పదెకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాం.
– వెలివెల కృష్ణయ్య, జయలక్ష్మి దంపతులు, పెనుబల్లి
పని ఎక్కువ… వేతనం తక్కువ..
ఉపాధి హామీ పనులకు వెళితే గతంలో చేసిన పనికి తగిన వేతనం లభించేది. కానీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి పథకం వెళ్లాక అనేక ఆంక్షలు వచ్చాయి. కూలీలకు సరైన వేతనం అందడంలేదు. ఉదయం, సాయంత్రం మస్టర్లు వేస్తూ కూలీల పొట్ట కొడుతున్నది. కేంద్రం ఇప్పటికైనా దిగి రావాలి.
– పీట్ల శ్రీను, ఉపాధి కూలీ, తాళ్లపెంట, పెనుబల్లి మండలం
వారం వారం వేతనం చెల్లించాలి..
గతంలో ఉపాధి పనికి వెళితే పనిచేసిన వారానికి వేతనం చేతికివచ్చేది. నేడు ఆ పరిస్థితి లేదు. ఎంత పనిచేసినా తక్కువ వేతనమే. పని చేసిన తర్వాత మూడు నెలలైనా వేతనం అందడం లేదు. వేసవిలో ఎండలను తట్టుకుంటూ పని చేస్తున్నాం. మాకు కేంద్రం వారం వారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. కూలి రోజుకు రూ.200 లోపే వస్తున్నది. గరిష్ఠ వేతనం అందించేలా చర్యలు తీసుకోవాలి.
– చిట్టిమాది మహేశ్వరి, ఉపాధి కూలీ, తాళ్లపెంట, పెనుబల్లి మండలం