భద్రాద్రి కొత్తగూడెం(నమస్తే తెలంగాణ)/ మధిర, ఆగస్టు 20: కాజీపేట జంక్షన్, భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్లను డివిజన్ కేంద్రాలుగా ప్రకటిస్తూ అభివృద్ధి చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. మధిర రైల్వే స్టేషన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటు గతంలో రద్దయిన ఎక్స్‌ప్రెస్ రైళ్లను పునరుద్ధరించాలని, కొత్త రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరారు.
సికింద్రాబాద్ రైల్ నిలయంలో గురువారం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పార్లమెంట్ మెంబర్స్ (ఎంపీలు) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే జోనల్ కేంద్రం కాగా, హైదరాబాద్ ఒక్కటే డివిజన్‌గా ఉన్నందున కాజీపేట, కొత్తగూడెంలను డివిజన్లుగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మధిర రైల్వే స్టేషన్‌ను రూ.25 కోట్లతో అభివృద్ధి చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే, ప్రయాణికులకు సంబంధించి పలు అంశాలను ఆయన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
గౌతమి, నాందేడ్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్‌ను పునరుద్ధరించాలని, పద్మావతి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రస్తుతం ఒకవైపు మాత్రమే ఆగుతున్నాయని, వీటిని అప్ అండ్ డౌన్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లక్నో-చెన్నై ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి-షాలీమార్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మధిరలో హాల్టింగ్ కల్పించాలని కోరారు. దెందుకూరు వద్ద రైల్వే ట్రాక్ పకన ఉన్న రైతుల భూమికి సంబంధించిన వివాదాన్ని ఎంపీ ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అది ప్రైవేటు పట్టా భూమి అని, అందులో రైతులు సాగు చేసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేస్తున్నా.. రైల్వే అధికారులు మాత్రం రైతులను ఆ భూముల్లోకి వెళ్లనివ్వడం లేదన్నారు. దీనిపై తక్షణమే స్పందించి రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు.
ఖమ్మం స్టేషన్లో ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీసీటీవీ కెమెరాలను ఇంకా పెంచాలని కోరారు. ధంసలాపురం పాత రైల్వే గేట్ వద్ద అండర్ పాస్ మంజూరు చేయాలని, మల్లెమడుగు రైల్వే స్టేషన్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. పందిళ్లపల్లి రైల్వే స్టేషన్లో ర్యాక్ పాయింట్ ఉన్న దృష్ట్యా దానిని మరింత అభివృద్ధి చేయాల్సిందిగా సూచించారు. భద్రాచలం రోడ్ కొత్తగూడెం నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును వెంటనే మంజూరు చేయాలని కోరారు. సికింద్రాబాద్-బెళగావి ఎక్స్‌ప్రెస్ రైలును కొవిడ్‌కు ముందు మాదిరిగా మణుగూరు వరకు పొడిగించాలని, కాజీపేట-మణుగూరు ప్యాసింజర్ రైలును తిరిగి కొనసాగించాలని వద్దిరాజు కోరారు.