తరగతి గదిలో ‘ప్రజంట్ సార్..’ అంటూ హాజరును నమోదు చేసే ప్రక్రియ నుంచి.. వేలిముద్రల ద్వారా హాజరును తీసుకునేలా మార్పులొచ్చాయి. అంతా సవ్యంగా సాగుతున్నప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు డిగ్రీ విద్యలో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) ద్వారా హాజరును నమోదు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్ఆర్ఎస్ హాజరు కూడా కేవలం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకే అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి ఎలాంటి ఆదేశాలూ అందలేదు. 2026-27 విద్యాసంవత్సరంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దీనిని అమలు చేయనుంది.
-ఖమ్మం, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ప్రతి విద్యార్థీ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న ‘టీజీసీసీఈ’ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్‌లో విద్యార్థి వివరాలు, ఫొటోను పొందుపర్చాలి. అనంతరం ప్రతి రోజూ విద్యార్థుల హాజరును నమోదు చేసేది మాత్రం అధ్యాపకులే. తరగతి గదిలో సంబంధిత అధ్యాపకులు వారి సెల్ ద్వారా విద్యార్థుల ఫొటోలు తీస్తారు. అందులో నమోదైన విద్యార్థులు తరగతి గదిలో ఉన్నప్పుడు హాజరు ఫొటోతో సహా నమోదవుతుంది. రోజులో ఒక్కసారి మాత్రమే హాజరును నమోదు చేస్తారు. అధ్యాపకుడు ఫొటో తీసే సమయంలో విద్యార్థి కనిపించకపోయినా, కొంచెం ఆలస్యమైనా గైర్హాజరు కిందే నమోదు అవుతుంది. కళాశాల విద్యా కమిషనర్ నేరుగా ఏయే కళాశాలల్లో ఎంత హాజరు నమోదైందో పర్యవేక్షించవచ్చు.
స్కాలర్‌షిప్‌లకు లింక్..
విద్యార్థులు ప్రభుత్వం నుంచే పొందే స్కాలర్‌షిప్‌లకు ప్రభుత్వం ఎఫ్ఆర్ఎస్ హాజరును లింక్ పెట్టింది. ఇప్పటి వరకు ఇంజినీరింగ్ కళాశాలల్లో అధ్యాపకులకు, విద్యార్థులకు బయోమెట్రిక్ ద్వారా హాజరును అమలుచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించడానికి గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంస్కరణలు అమలుచేశారు. అవి విజయవంతంగా అమలవుతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయంలో విద్యార్థులు నేరుగా కళాశాలల్లో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ ద్వారా హాజరును నమోదు చేసుకునేవారు. ఏ అధ్యాపకుల సహకారం లేకుండానే వారికి కేటాయించిన కోడ్ ఆధారంగా వేలిముద్రతో హాజరు నమోదు చేసుకునే వారు. స్కాలర్షిప్లు సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్నా సమస్యలు రాలేదు. ఇప్పుడు అమలు చేసే ఎఫ్ఆర్ఎస్ ద్వారా రోజులో ఒక్కసారి మాత్రమే, అది కూడా అధ్యాపకులు తీసుకునే ఫొటోతో మాత్రమే హాజరంటేనే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నట్లు విద్యావేత్తలు చెబుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో పది కళాశాలలు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలున్నాయి. ఖమ్మంలో ఐదు, భద్రాద్రి కొత్తగూడెంలో మరో ఐదు కళాశాలలున్నాయి. వీటిల్లో సైన్స్, ఆర్ట్స్ కోర్సుల్లో కలిపి సుమారు 10 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి ఈ విద్యాసంవత్సరం నుంచి ఎఫ్ఆర్ఎస్ హాజరును నమోదు చేస్తున్నారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇప్పటికే విద్యార్థులతో యాప్ డౌన్లోడ్ చేయించి అధ్యాపకులతో విద్యార్థుల వివరాలను నమోదు చేయిస్తున్నారు.
ఎఫ్‌ఆర్‌ఎస్‌తో సమయం ఆదా..
ఎఫ్ఆర్ఎస్ విధానంతో అధ్యాపకులకు హాజరు తీసుకునే సమయం ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆదా అవుతుంది. మరింత సమయం బోధించడానికి సానుకూలంగా ఉంటుంది. ఒక క్లిక్‌తో హాజరు తీసుకోవడం పూర్తవుతుంది. విద్యార్థుల డేటా డిజిటల్‌గా నమోదై ఉంటుంది. ఇది ఇతర సమాచారానికీ ఉపయోగపడుతుంది.
-డాక్టర్ జాకీరుల్లా, ప్రిన్సిపాల్, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల, ఖమ్మం