నిరుపేదలైన అర్హులను అణగదొక్కి కాంగ్రెసోళ్లకే ఇండ్లను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా దాదాపు ఆరుసార్లు సర్వేలు చేసీ చేసీ చివరకు తమ సొంత పార్టీ వారినే లబ్ధిదారులుగా నిర్ణయించింది. ఇందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సభ్యులుగా ఉన్న ‘ఇందిరమ్మ కమిటీ’లు సంపూర్ణంగా సహకరించాయి. అయితే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేదలు తమ సొంతింటి కల చెదిరిపోవడంతో గుండెపగిలి రోదిస్తున్నారు. కటిక పేదరికంలో ఉన్న తమను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి గొంతు కోసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏమిచేయాలో తోచక అధికారుల కాళ్లావేళ్లా పడి వేడుకుంటున్నారు.. అధికారులేమో సర్వేలు చేయడం వరకే మా పని అన్నట్లుగా చేతులెత్తేశారు. ఇదిలా ఉంటే.. ఇదే అదునుగా పేదలను మోసం చేసేందుకు రూ.50 వేలు ఇస్తే ఇల్లు వస్తదంటూ కాంగ్రెస్ నాయకులు బేరసారాలు చేస్తుండడం గమనార్హం. ఏదేమైనా బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులందరికీ అందాయని గ్రామాల్లో ప్రజలు చెప్పుకుంటున్నారు.
-ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, మే 2
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల నిర్ణయం.. పేదల పాలిట శాపంగా మారింది. ఓట్లకు ముందు కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు నమ్మి ఆ పార్టీని గెలిపించినందుకు తమ గోతి తామే తవ్వుకున్నట్లు ఉందని ప్రజలు బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ పథకంలో ఇండ్లు నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధానాలు చూసి తలలు పట్టుకుంటున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకం అమలు చేసినా పార్టీలకతీతంగా అర్హులందరికీ ఫలాలు అందేవి. బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం లేకుండానే డబుల్ బెడ్రూం ఇండ్లు, ఆసరా పింఛన్లు, రైతుబంధు లాంటి ఎన్నో పథకాలు అర్హులకు అందాయి. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా దాదాపు ఆరుసార్లు సర్వేలు చేసి అర్హులను గుర్తించింది.
అధికారులు వెల్లడించిన జాబితాలో పేర్లు ఉన్న పేదలు తమకు ఇండ్లు మంజూరయ్యాయని సంతోషంలో ఉండగానే ఇది ఫైనల్ కాదని, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎంపిక చేసిన జాబితానే ఫైనల్ అని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు అర్హులను కాకుండా వారికి అనుకూలంగా ఉన్నవారు, కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంతో పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. దీంతో గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేశామని చెప్పింది. కానీ.. ఖమ్మం జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు కలిపి 17,500 ఇండ్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు పైలట్ గ్రామాల కింద ఎంపిక చేసిన 20 గ్రామాల్లో 1,071 ఇండ్లు మాత్రమే మంజూరయ్యాయి. వీటిలో దాదాపు 320 ఇండ్లు మాత్రమే నిర్మాణ పనులు ప్రారంభించారు.
ఇందిరమ్మ పథకంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారుడికి రూ.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. వీటిని నాలుగు విడతలుగా బేస్మెంట్ లెవల్ పూర్తికాగానే రూ.లక్ష, రూఫ్ లెవల్‌కు మరో రూ.లక్ష, స్లాబ్ పూర్తికాగానే రూ.2 లక్షలు, పనులన్నీ పూర్తయ్యాక మిగిలిన రూ.లక్ష ఇస్తారు. ఖమ్మం జిల్లాలో ఇండ్ల నిర్మాణ పనులు నత్తనడక నడుస్తుండగా.. ఇప్పటివరకు కొద్దిమందికి మాత్రమే బేస్మెంట్ లెవల్లో ఇచ్చే రూ.లక్ష బిల్లులు ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఇచ్చే సొమ్ముపైనే ఆధారపడిన నిరుపేదలు ఇండ్లు కట్టేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
పేరుకు మాత్రమే అధికారుల సర్వే జరుగుతోంది. అన్ని పంచాయతీల్లో ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలోనే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతున్నది. కాంగ్రెస్ నాయకులకు నచ్చినవారికే ఇండ్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో రూ.50 వేలు ఇస్తేనే ఇల్లు ఇస్తామని కాంగ్రెస్ నాయకులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నవి. ఖమ్మం జిల్లాలో 569 గ్రామాల్లో ఇప్పటికే 20 గ్రామాలు పైలట్ గ్రామాలుగా ఎంపిక కాగా.. మిగిలిన పంచాయతీల్లో అర్హుల జాబితా రావాల్సి ఉంది.
అశ్వారావుపేట రూరల్, ఏప్రిల్ 2: ఎకరాలకొద్దీ భూములు, ట్రాక్టర్లు ఉన్న వారికే ఇండ్లు ఇస్తారా? భూమి లేని నిరుపేదలు అర్హులు కాదా? ముందస్తు సమాచారం ఇవ్వకుండా సర్వే కోసం ఎలా వస్తారు? అని ప్రశ్నిస్తూ అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం గ్రామస్తులు సర్వేకు వచ్చిన పంచాయతీ కార్యదర్శిని శుక్రవారం అడ్డుకున్నారు. అసలు ఇందిరమ్మ కమిటీ సభ్యులను ఎవరు నియమించారు? వారు గ్రామంలో తిరిగి నిరుపేదలకు గుర్తించారా? అని నిలదీశారు. ట్రాక్టర్లు, భూములు ఉండి.. తమకు అనుకూలంగా ఉన్న వారి పేర్లతో జాబితా రూపొందించారని నిరుపేదలు ఆరోపించారు. నిరుపేదల కోసం ప్రభుత్వం 34 ఇళ్లు మంజూరు చేస్తే కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా ఉన్న వారి పేర్లు రాసుకొని నిరుపేదలకు అన్యాయం చేశారని ఆరోపించారు .
జూలూరుపాడు, మే 2: ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అనర్హుల పేర్లు తొలగించి అర్హులకే ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామస్తులు బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఇండ్ల జాబితాలో తమకు అన్యాయం జరిగిందని నిరుపేద మహిళలు పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. భవనాలు, భూములు ఉన్న వారికి ఇండ్లు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు.
ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్పిన పేర్లు రాసుకొని కనీసం విచారణ చేపట్టకుండా అర్హుల జాబితాను ప్రకటించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి అర్హులైన వారికి ఇండ్లు మంజూరు చేయాలని గ్రామస్తులు, ఆయా పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మేము రేకుల షెడ్డులో ఉంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు వస్తుందని ఆశతో దరఖాస్తు చేసుకున్నా. గ్రామసభలో ఇండ్ల కోసం ఎంపికైన వారి పేర్లు పెట్టారు. అందులో నాది మొదటి పేరు. తప్పక ఇల్లు వస్తుందని ఆశపడ్డా. కానీ.. మూడు రోజుల నుంచి కాంగ్రెసోళ్లు మళ్లీ సర్వే చేశారు. మా ఇంటికి ఎవరూ రాలేదు. దీని గురించి పంచాయతీ సిబ్బందిని అడిగితే.. మీ పేరు లేకపోవడంతో రాలేదని చెప్పారు. ఇది చాలా అన్యాయం. అధికారులు సర్వే చేసినప్పుడు మా పేరు ఉంది. అధికారులే దయ చూపాలి.
-బొమ్మకంటి లలిత, తీర్థాల, ఖమ్మం రూరల్
భర్తకు దూరంగా ఇద్దరు ఆడపిల్లలతో రేకుల ఇంట్లో ఉంటున్నా. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు పెడితే.. గ్రామసభలో నా పేరు వచ్చింది. కానీ.. సర్వే చేయడానికి మా ఇంటికి ఎవరూ రాలేదు. ఎవరికీ తెలియకుండా వచ్చి సర్వే చేస్తున్నారు. ఇంటి గురించి ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు. కూలి పనులకు వెళ్లి పిల్లలను సాకుతున్నా. గురువారం రాత్రి వచ్చిన గాలిదుమారానికి ఇంటి రేకులు లేచిపోయాయి. అధికారులు మా బాధను అర్థం చేసుకొని ఇల్లు ఇవ్వాలి.
-జర్పుల కృష్ణవేణి, తీర్థాల, ఖమ్మం రూరల్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ మా పూరి గుడిసెను సందర్శించారు. నేను గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటగా మీకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామసభ మొదటి విడతలో మా పేరు ఉంది. నాయకులకు డబ్బులు ఇవ్వలేదని మొదటి జాబితా నుంచి పేరు తొలగించారు. అధికారులు మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూడాలి.
-బానోత్ వినోద, బిక్యాతండా, కారేపల్లి
పూరి గుడిసెలో బికుబికుమంటూ జీవనం గడుపుతున్నాం. మాకు ఎలాగైనా ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందని ఎంతో ఎదురుచూశాం. ఇందిరమ్మ ఇండ్ల జాబితా తయారీలో కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన వారికే ఇండ్లు మంజూరు చేస్తున్నారు. మాలాంటి పేదోళ్లకు అన్యాయం చేస్తున్నారు. అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి.
-గుగులోత్ నగేశ్, బిక్యాతండా, కారేపల్లి
మాకు ముగ్గురు పిల్లలు. భర్త ఇంటిని పట్టించుకోడు. బయటనే తిరుగుతుంటాడు. కూలి పనులు చేసుకుని పిల్లలతో బతుకుతున్నాను. కనీసం నీడ కోసం గూడు కూడా ఇవ్వకపోతే ఎలా? మాలాంటి కటిక పేదవాళ్లను కూడా కనికరించకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి? ఉన్నవాళ్లకు ఇండ్లు వస్తున్నాయి. మా ఊర్లో పేదవాళ్లు అధికారులకు కనబడడం లేదు.
-పల్లపు సుగుణ, బుచ్చన్నగూడెం, అన్నపురెడ్డిపల్లి
కూలి పనులు చేస్తేగానీ మాకు పూట గడవదు. మాలాంటి పేదవాళ్లను చూసినా ప్రభుత్వ అధికారులకు మనసు కరగదా? పేదలకు ఇండ్లు ఇస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుంది.. కానీ అధికార పార్టీ వాళ్లకు ఇస్తే మంచిపేరు ఎలా వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు న్యాయం చేస్తుందని అనుకున్నాం.. ఇలా అన్యాయం చేస్తుందని ఊహించలేదు.
-ఇనుపనూరి సరోజ, అయ్యన్నపాలెం, చండ్రుగొండ
నిరుపేదలమైన మాకు పూరి గుడిసె ఉంది. అధికారులు సర్వేకు వచ్చినప్పుడు మా గుడిసెను చూసి మీకు ఇల్లు వస్తుందని చెప్పారు. కానీ.. జాబితాలో నా పేరు రాలేదు. మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. నాకు ఇల్లు ఎందుకు మంజూరు కాలేదో అర్థం కావడం లేదు. అన్నీ ఉన్న వారికే ఇల్లు ఇవ్వడం ఎంతవరకు సబబు. ప్రభుత్వం నాకు న్యాయం చేయాలి.
-బట్ట రుక్మిణి, కమలాపురం, మణుగూరు
నాకున్న తాటాకుల ఇల్లు వర్షం వస్తే అంతా కురుస్తుంది. మోకాలి లోతు నీరు వచ్చి చేరుతుంది. వర్షం వస్తే మా గోస ఆ దేవుడికే తెలుసు. అధికారులు నీకు ఇల్లు వచ్చిందని చెప్పారు. కానీ.. ఇప్పుడు కొందరికే ఇండ్లు మంజూరయ్యాయని చెబుతున్నారు. మరో జాబితాలో మీకు వస్తుందని అంటున్నారు. మేం నిరుపేదలం అని ఇంకెన్ని ఆధారాలు చూపించాలి.
-మాటూరి నాగమ్మ, కమలాపురం, మణుగూరు
బచ్చోడులో భూములు, ఉద్యోగాలు ఉన్న వారికి, ధనికులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. మాలాంటి పేదోళ్లు, దళితులకు ఇండ్లు మంజూరు చేయలేదు. దీని గురించి పంచాయతీ కార్యదర్శిని అడిగితే.. సరైన సమాధానం ఇవ్వడం లేదు. మాకున్న పూడి గుడిసె వానొస్తే అంతా కురుస్తుంది. మా లాంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోవడం అన్యాయం. అధికారులు మాపై దయచూపాలి.
-దారమళ్ల రాణి, బచ్చోడు, తిరుమలాయపాలెం
మాది రేకుల ఇల్లు. మేము ఏ పార్టీలో లేము. నిరుపేదలమైనప్పటికీ మాకు ఇల్లు ఇవ్వలేదు. ఉన్నోళ్లు, ధనికులకే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. ఎవరికీ న్యాయం చేయని ఇందిరమ్మ కమిటీలను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వ అధికారులే గ్రామాల్లో ఇంటింటి సర్వే చేసి ఇండ్లు మంజూరు చేయాలి. మాకు జరిగిన అన్యాయంపై ఎంపీడీవోకు ఫిర్యాదు చేశాం. ఇండ్ల విషయంలో మా పేదలకు న్యాయం చేయాలి.
-నందిపాటి రేణుక, బచ్చోడు, తిరుమలాయపాలెం