‘సరఫరా’ కు సమాయత్తం..” సమస్యలు యథాతథం
మూడు నెలల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశం అందిందే తడవుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బియ్యం సరఫరాకు సమాయత్తమవుతోంది. కానీ, ఏ ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయి ఇబ్బందులను గుర్తించడం లేదు.
- ఒకేసారి ‘మూణ్నెల్ల రేషన్’ సరఫరాకు ఆదేశంతో ఆందోళనలో డీలర్లు
- వేలిముద్రల కోసం గంటల తరబడి లబ్ధిదారులకు తప్పని నిరీక్షణలు
- నిరుడు మూడుసార్లు వేలిముద్రలతో విసిగివేసారిన డీలర్లు, లబ్ధిదారులు
- ఈసారి వేసవికావడం, సరిపడా గోదాముల్లేకపోవడంతో తప్పని ఇక్కట్లు
- కేంద్రం ఆదేశానికి రాష్ట్రం ఆమోదం.. గోదాములకు చేరుతున్న చౌకబియ్యం..
రఘునాథపాలెం, మార్చి 23 : మూడు నెలల రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఒకేసారి పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ ఆదేశం అందిందే తడవుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బియ్యం సరఫరాకు సమాయత్తమవుతోంది. కానీ, ఏ ప్రభుత్వం కూడా క్షేత్రస్థాయి ఇబ్బందులను గుర్తించడం లేదు. నిరుడు కూడా ఇదే విధానాన్ని పాటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రేషన్ బియ్యం పంపిణీ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఇటు డీలర్లు, అటు లబ్ధిదారులు అనేక ఇబ్బందులు పడిన విషయంపై స్పందించడం లేదు. దీంతో సమస్యలు యథాతథంగా ఉండగానే బియ్యం సరఫరాకు మాత్రం యంత్రాంగాన్ని సమాయత్తం చేశాయి. దీంతో సదరు బియ్యం కూడా కొన్నిచోట్ల గోదాములకు, మరికొన్ని చోట్ల రేషన్ దుకాణాలకు చేరుతున్నాయి. మరి సమస్యల పరిష్కారానికి చర్యలేంటనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రావడంలేదు.
బియ్యం నిల్వలకు సరిపడా గోదాముల్లేవు. పైగా వేసవి కాలం. ఈ నేపథ్యంలో ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలను ఆదేశించింది. ఇందుకు తెలంగాణ సర్కారు కూడా ‘సై’ అన్నది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం జిల్లా సివిల్ సప్లయీస్ అధికారులు మూణ్నెల్ల రేషన్ పంపిణీకి సమాయత్తమవుతున్నారు. ఈ నెల 30లోగానే మండల లెవల్ స్టాక్(ఎంఎల్ఎస్) పాయింట్ల నుంచి జిల్లాలోని అన్ని రేషన్ షాపులకు చౌక బియ్యం చేరుకునేలా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
నిరుడు కూడా వర్షాకాలం సందర్భంగా జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని భావించాయి. అనుకున్నదే తడవుగా కేంద్రం ఆదేశించడం, రాష్ట్రం అంగీకరించడం, బియ్యం సేకరించడం, చౌక దుకాణాలకు పంపడం వంటివి జరిగిపోయాయి. కానీ, మూడు నెలల బియ్యాన్ని నిల్వ చేసే సామర్థ్యం చౌక దుకాణాల్లో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. అదీగాక, మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు ఈ-పాస్ యంత్రాలను సాంకేతికంగా సమాయత్తం చేయకపోవడం వంటి కారణాల వల్ల ఒకవైపు డీలర్లు, మరోవైపు లబ్ధిదారులు తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
మూడు నెలల బియ్యం తీసుకునేందుకు ఈ-పాస్ మిషన్‌లో మూడుసార్లు వేలిముద్ర వేయాల్సి రావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు నెలల బియ్యం తీసుకునేందుకు ఒక్కో లబ్ధిదారుడు మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి వచ్చింది. కొన్నిచోట్ల నెట్వర్క్ సమస్యలూ తలెత్తాయి. దీంతో ఒక్కో లబ్ధిదారుడికి మూడు నెలల బియ్యం పంపిణీ చేసేందుకే 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టింది. అలా వందలాది మంది లబ్ధిదారులు వచ్చి రేషన్ షాపు వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రేషన్‌షాపుల వద్ద రోజుల తరబడి లబ్ధిదారులు నిరీక్షించిన సందర్భాలూ లేకపోలేదు. దీంతో ఈసారైనా అలాంటి ఇబ్బందులు రాకుండా లబ్ధిదారుడు ఒకేసారి వేలిముద్ర వేస్తే మూడు నెలల రేషన్ పంపిణీ జరిగేలా ఈ-పాస్ యంత్రాల్లో ఆప్షన్ రూపొందించాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు.
బియ్యం తరుగుతో నష్టపోతున్న డీలర్లు
ఎంఎల్ఎస్ పాయింట్‌కు చేరుకునే స్టేజ్-1 లారీల్లో కొన్ని బస్తాలు తరుగు రావడం, తూకం లేకుండానే అదే బస్తాలను స్టేజ్-2 లారీలకు లోడ్ చేసి రేషన్ షాపులకు పంపిణీ చేయడం వంటి కారణాలతో రేషన్ డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంపై రేషన్ డీలర్ల యూనియన్ నేతలు వెళ్లి అధికారులను కలిసి సమస్యను విన్నవిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఎంఎల్ఎస్ పాయింట్ల ఇన్చార్జులు మాత్రం అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండానే,
కాంటాలు వేయించకుండానే నేరుగా హమాలీలతో స్టేజ్-1 నుంచి లారీల్లోని బియ్యాన్ని స్టేజ్-2 లారీలకు లోడ్ చేయించి రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. అయితే, దీనిని కట్టడి చేసేందుకు మూణ్నెల్ల బియ్యం పంపిణీలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ప్రత్యేకంగా 12 మంది జీపీవోలను కేటాయించారు. స్టేజ్-1 నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చే స్టాకును సరైన తూకంతో వచ్చేలా జీపీవోలు పర్యవేక్షణ చేపట్టనున్నారు. అనంతరం తూకం ప్రకారం రేషన్ షాపులకు సక్రమంగా రేషన్ బియ్యం చేరే విధంగా జీపీవోలకు బాధ్యతలను అప్పగించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

