ఖమ్మం రూరల్, మే 30 : రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలని చూస్తే కటకటాలపాలు కాక తప్పదని వ్యవసాయ శాఖ కూసుమంచి డివిజన్ ఏడీ బి.సరిత హెచ్చరించారు. శుక్రవారం ఏఓ జె. ఉమానగేశ్, ఖమ్మం రూరల్, ఎస్ఐ వై.వెంకటేశ్వర్లుతో కలిసి ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు గ్రామంలో విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, ఇన్ వాయిస్ వివరాలు, బిల్ బుక్స్, ప్రిన్సిపుల్స్ సర్టిఫికెట్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో విత్తనాలు కొనుగోలు చేసే రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలని, తీసుకున్న రసీదులు పంట చేతికి వచ్చేవరకు భద్రపరుచుకోవాలని ఆమె సూచించారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో లూజు విత్తనాలు అమ్మే వారి దగ్గర విత్తనాలు కొనుగోలు చేయొద్దన్నారు. అటువంటి విత్తనాలు అమ్మే వ్యక్తులు తారసపడితే గ్రామ వ్యవసాయ శాఖ అధికారులకు తెలుపాలన్నారు. నాసిరకం నకిలీ విత్తనాలను రైతులకు అంటగడితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఏడీఏ హెచ్చరించారు. ప్రభుత్వంచే ధృవీకరించబడిన కంపెనీల విత్తనాలు మాత్రమే అమ్మకాలు చేపట్టాలని షాప్ యజమానులకు సూచించారు.