కారేపల్లి, అక్టోబర్ 14 : గిరిజన ఆశ్రమ పాఠశాలల డైలీవేజ్, కాంటినెంట్ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని మేకలతండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. మండలంలోని వివిధ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లంతా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. ప్రభుత్వం సమస్యను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. డైలీ వేజ్ వర్కర్లంతా 34 రోజులుగా సమ్మె చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్కర్లకు వేతనాలు పెంచాల్సింది పోయి ఉన్న వేతనాల్లో కోతలు విధించడం అన్యాయమన్నారు. గతంలో ఇచ్చిన విధంగా రోజువారి వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. రోజువారి వేతనం తగ్గించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. డైలీవేజ్ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.