ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెట్టి లబ్ధిదారుల సహనాన్ని పరీక్షిస్తున్నది. రోజుకో నిబంధన.. పూటకో మార్పు చేస్తూ ఆంక్షలు విధిస్తున్నది. దీంతో పేదల సొంతింటి కల కలగానే మిగిలిపోతున్నది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లావ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదలు ఇంటిస్థలం ఉండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణితో అనర్హులుగా మిగిలిపోతున్నారు. ఇందిరమ్మ ఇంటి మంజూరు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇండ్లను ప్రారంభించి బేస్మెంట్ లెవల్ వరకు నిర్మించుకున్న వారిని అనర్హులుగా పక్కన పడేస్తున్నారు. దీంతో వారు లబోదిబోమంటున్నారు. ఏదేమైనా పేదోడి సొంతింటి కల నెరవేరకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతున్నట్లు తేటగా కనిపిస్తున్నది.
– రఘునాథపాలెం, ఆగస్టు 6
ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే ఉన్న ఖాళీ స్థలంలో కట్టుకోవచ్చనే ఆశతో ఎదురుచూస్తున్న పేదల ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం అడియాశలు చేస్తున్నది. ఇంటినెంబర్ లబ్ధిదారు పేరుతో లేదని, ఇల్లు మంజూరైన లబ్ధిదారుని పేరుతో ఇంటిపత్రాలు లేవనే సాకుతో అనేకమంది పేదలను అనర్హుల జాబితాలో చేర్చుతున్నారు. అంతెందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలోని కచ్చితమైన నిబంధనలపై అధికారులకు సైతం సరైన అవగాహన లేదంటే ఇంకా పథకం అమలు తీరు ఏవిధంగా ఉన్నదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
విలువైన ప్రైవేటు ప్లాటును కలిగి ఉంటే ధనికులను సైతం ఇందిరమ్మ పథకానికి అర్హులుగా చేస్తున్న ప్రభుత్వం.. ఖాళీ ప్లాటు ఉండి కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్న నిరుపేదలకు మాత్రం సవాలక్ష కొర్రీలు పెడుతోందని వేదన చెందుతున్నారు. అసలు ఇల్లు లేకుండా ఇంటిపేరు ఎలా వస్తుందని ఖాళీ ప్లాట్లు కలిగిన నిరుపేదలు ప్రశ్నిస్తున్నారు. అప్పోసొప్పో చేసి ఇతరుల వద్ద ప్లాట్లు కొనుగోలు చేస్తే.. మీ పేరుతో పట్టాపత్రాలు లేవనే సాగుతో అనర్హులుగా చేస్తున్నారని వాపోతున్నారు.
వాళ్లంతా అనర్హులే… :
ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేసే క్రమంలో గతంలో బేస్మెంట్ లెవల్ వరకు నిర్మించుకున్న వారిని అనర్హులుగా పక్కన పడేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు ప్రకటించగానే తమ వద్ద ఉన్న కూసిన్ని డబ్బులు ఖర్చు అయిపోతాయనే భయంతో ఖాళీ ప్లాటులో బేస్మెంట్ లెవల్ వరకు కట్టుకొని ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిని ప్రభుత్వం అనర్హులుగా ప్రకటిస్తుండటంతో పేదలు లబోదిబోమంటున్నారు. కొత్తగా ముగ్గు పోస్తేనే అర్హులని, అప్పటికే బేస్మెంట్ నిర్మించుకొని ఉంటే అనర్హులని తేల్చి చెప్తుండటంతో దిక్కుతోచని స్థితిలో లబ్ధిదారులు ఉన్నారు.
దీంతో తమను ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో చేర్చరనే భయంలో నిరుపేదలు ఉన్నారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం తమను డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి అర్హులుగా చేర్చి మంజూరుపత్రాలు అందజేయడంతో బేస్మెంట్ నిర్మించుకున్నామని, ఇప్పుడు బేస్మెంట్ నిర్మించుకొని ఉన్న నాటి లబ్ధిదారులను అనర్హులుగా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఖాళీ స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభు త్వం.. ఇప్పుడు పథకం కార్యాచరణలో కొత్త కొత్త నిబంధనలు తీసుకరావడమేంటని ప్రశ్నిస్తున్నారు.
బేస్మెంట్ కట్టుకొని ఎదురుచూస్తున్న..
ఖమ్మం నగరం పాండురంగాపురంలో అనేక ఏళ్లుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాము. గ్రామంలోనే ఖాళీ ప్లాటు ఉండటంతో గత కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకునేందుకు అర్హురాలిగా గుర్తించి మంజూరు పత్రాన్ని అందజేసింది. దీంతో బిల్లు వస్తదనే ఆశతో అప్పు చేసి బేస్మెంట్ వరకు నిర్మించుకున్నాను. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులను అనేకమార్లు కలిసి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని వేడుకున్నా.
నా మొరను ఆలకించిన స్థానిక ప్రజాప్రతినిధి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అర్హురాలిగా జాబితాలో చేర్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పథకంలో తెచ్చిన కొర్రీలతో బేస్మెంట్ ఉన్న ఇంటికి బిల్లులు రావని, కొత్తగా ముగ్గులు పోసుకొని మొదలుపెట్టిన వాళ్లు మాత్రమే అర్హులని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అప్పు చేసి బేస్మెంట్ వరకు నిర్మించుకున్నాను. కలెక్టర్ స్పందించి ఇందిరమ్మ పథకంలో ఇల్లు కట్టుకునేందుకు నాకు అవకాశం కల్పించాలి.
– ఆవుల జగదాంబ, పాండురంగాపురం, లబ్ధిదారురాలు