బోనకల్లు, జూన్ 25 : రోడ్డు నిర్మాణం కోసం ఉపయోగిస్తున్న బొగ్గు బూడిద, డస్ట్‌తో పంటలు నాశనం అవుతున్నాయని నాగపూర్- అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాహకులకు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన రైతులు వినతి పత్రం అందజేశారు. బుధవారం మండలంలోని చిన్నబీరవల్లి సమీపంలో రోడ్డు నిర్మాణ పనుల నిర్వహణ కార్యాలయానికి తూటికుంట్ల గ్రామానికి చెందిన రైతులు జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షుడు వేమూరి ప్రసాద్ మాట్లాడుతూ… నాగపూర్- అమరావతి రోడ్డు నిర్మాణం కోసం టిప్పర్ల ద్వారా బొగ్గు, బూడిద, డస్ట్‌ను తీసుకొస్తున్నారని తెలిపారు.
కేటీపీఎస్‌లో ఉపయోగించిన బొగ్గు ద్వారా వచ్చిన బూడిదను రోడ్డు నిర్మాణం కోసం తీసుకువస్తున్నారని, ఆ బూడిద ఒకేచోట డంపింగ్ చేస్తున్నారని, ఆ సమయంలో సమీప ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలిపారు. మళ్లీ రోడ్డుకు తరలించే సమయంలో బూడిద లేచి పంటలపై పడుతుందన్నారు. దీనివల్ల పంటలు తీవ్రంగా నష్టపోతాయని, ఒకే చోట డంపింగ్ చేయకుండా ఎప్పటికప్పుడు ఆ డస్ట్‌తో పనులు చేసుకోవాలని కోరారు. ఇలా చేస్తే ఇబ్బంది తలెత్తదన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సాధినేని వెంకటేశ్వర్లు, తుళ్లూరి లక్ష్మీనరసయ్య, కంచర్ల అచ్చయ్య, ఇటికాల శ్రీనివాసరావు, సాధినేని రాంబాబు, శ్రీనివాసరావు, యంగల కనకయ్య సాధినేని అఖిల్, బాబు పాల్గొన్నారు.